ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ దాడి చేయడంతో పాక్ కు ఎటూ తోచడం లేదు. అంతర్జాతీయంగా భారత్ ను బద్నాం చేసేందుకు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. తమ దేశ భూభాగంలో దాడులు చేశారని, అగ్రరాజ్యాల చేత సానుభూతి పొందేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ దాడుల గురించి అమెరికాకు ఫిర్యాదు చేసింది. అయినా.. టెర్రరిస్ట్ క్యాంప్ లపై భారత్ దాడులు చేయడంలో తప్పేం ఉందని అమెరికా రివర్స్ ప్రశ్నతో పాక్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది.
వాస్తవానికి పాక్ లో దాడులు చేస్తుందని భారత్ సన్నాహక చర్యలతోనే ప్రపంచమంతా గుర్తించింది. భారత్ కూడా పాక్ పౌరులపై కాకుండా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తామని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏ దేశం కూడా అభ్యంతరం చెప్పలేకపోయింది. అభ్యంతరం తెలిపితే ఉగ్రవాదానికి మద్దతు తెలిపినట్లే అవుతుంది. అందుకే భారత్ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. పైగా.. అగ్రదేశాలకు పాక్ పై దాడి గురించి భారత్ ముందే సమాచారం అందించింది.
భారత్ దాడి చేయడంతో పాక్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి’ అన్నట్లుగా మారింది. భారత్ పై ప్రతిగా దాడి చేస్తే ఏం జరుగుతుందో తెలుసు. అయినా అక్కడి ఆర్మీ, ప్రభుత్వంపై కొన్ని చోట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. భారత్ దాడి చేస్తే, తిరిగి దాడి చేసేందుకు మీకు చేతకావడం లేదా అని రెచ్చగొట్టే వాళ్లు ఉంటారు. వారిని ఏదో ఒక రకంగా సంతృప్తి పరిచేందుకు గత వీడియోలు వైరల్ చేసింది కానీ బెడిసికొట్టాయి.
ధైర్యం చేసి భారత్ భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే పాక్ విమానాలు మళ్లీ వెనక్కి వెళ్లే చాన్స్ ఉండదు. ఎందుకంటే పాక్ యుద్దవిమానాలు భారత గగనతలంలోకి వస్తే కూల్చివేయడానికి భారత వైమానికదళం కాచ్చుకూర్చుంది. అందుకే పాక్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతోంది.