టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగుతానని, టెస్టులకు మాత్రం గుడ్ బై అంటూ – సెలవు తీసుకొన్నాడు. ఇది నిజంగా అనూహ్యమైన నిర్ణయమే. రోహిత్ ఇంత సడన్‌గా రిటైర్ అవుతాడని క్రికెట్ వర్గాలు ఊహించలేకపోయాయి. ఎందుకంటే గత సిరీస్‌లలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా తేలిపోయాడు. అప్పుడే రోహిత్ రిటైర్ అయిపోతే మంచిదన్న విమర్శలు, సలహాలూ ఎక్కువయ్యాయి. వాటిని అప్పట్లో రోహిత్ లైట్ తీసుకొన్నాడు. జట్టులో కొనసాగాలా వద్దా? అనే విషయంలో తనకు ఓ స్పష్టత ఉందని, ఇంకొన్నాళ్లు తాను ఆగగలనని ధీమాగా చెప్పేవాడు. త్వరలోనే ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ సన్నాహాలు మొదలు పెట్టింది. రోహిత్ ని కెప్టెన్ గా ప్రకటించి, టీమ్ ని ఎంపిక చేసే పనిలో ఉంది. ఇంతలోనే రోహిత్ `గుడ్ బై` చెప్పేశాడు. టెస్ట్‌లలో రోహిత్ ఫామ్ చాలా దారుణంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాడనిపిస్తోంది.
రోహిత్ నిష్కృమణతో ఇప్పుడు టెస్ట్ పగ్గాలు ఎవరికి అప్పగించాలా? అనే ఆలోచనలో పడింది బీసీసీఐ. వాళ్ల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి. సీనియర్ సభ్యుడైన బుమ్రాకి కెప్టెన్సీ అప్పగించడం. లేదా భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని శుభమన్ గిల్ ని కెప్టెన్‌గా ఎంపిక చేయడం. రోహిత్ గైర్హాజరీలో బుమ్రా కొన్ని టెస్టులకు నాయకత్వం వహించాడు. ప్రపంచంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా ప్రసిద్ధికెక్కిన బుమ్రా జట్టుని సైతం నడిపించగలడని బోర్డ్ నమ్ముతోంది. అయితే బుమ్రా ఈమధ్య తరచుగా గాయాలపాలవుతున్నాడు. తనకు వీలైనంత విశ్రాంతి ఇస్తూ, కీలకమైన మ్యాచ్‌లకు వాడుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ దశలో కెప్టెన్‌గా మరింత భాయం మోపడం ఇష్టంలేదు.
శుభ్‌మన్ గిల్ వయసు చాలా తక్కువ. తను మంచి ఫామ్ లో ఉన్నాడు. టెస్ట్‌లలో రెగ్యులర్ ఓపెనర్ బాధ్యత నెరవేరుస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్ జట్టుని చక్కగా నడిపిస్తున్నాడు. అందుకే బీసీసీఐ శుభ్ మన్ గిల్ వైపు మొగ్గు చూపించొచ్చు. పంత్, కె.ఎల్ రాహుల్ రూపంలో మరో రెండు ఆప్షన్లు కూడా ఉన్నాయి. అయితే పంత్ ఫామ్ లో లేడు. ఐపీఎల్ లో సైతం దారుణంగా ఆడుతున్నాడు. రాహుల్ జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఉండడో చెప్పలేని పరిస్థితి. అందుకే వీరిద్దరూ కెప్టెన్ రేసులో వెనుకబడ్డారు. రోహిత్ రిటైర్మెంట్ తరవాత ఓ సీరియర్ కే కెప్టెన్సీ అప్పగించాలంటే బుమ్రా సరైన ఆప్షన్. అలా కాకుండా భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొంటే మాత్రం గిల్ ని ఎంచుకోక తప్పదు.