జగన్ రెడ్డి స్కోర్ అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే అది ఆయన చెప్పుకున్నట్లుగా ఆయన ఇమేజో లేకపోతే ఆయనను అభిమానించే వారి సంఖ్యో కాదు.. ఆయనను నమ్ముకుని జైలుకు పోయేవాళ్ల సంఖ్య. తండ్రి అధికారంలో ఉన్నప్పుడే అడ్డగోలు పనులు చేసి చాలా మందిని జైలుకు పంపితే..అధికారంలోకి వచ్చాక చేసిన పనులతో ఇక లెక్కలేనంత మందికి అదే గతి పట్టిస్తున్నారు. గాలి జనార్ధనా రెడ్డితో పాటు ఐదారుగురు మళ్లీ చంచల్ గూడ జైలుకెళ్లారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి తప్పించుకున్నా అని అనుకున్నారు కానీ మూడు నెలల్లో ఆమెకూ తప్పదని తాజాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో స్పష్టమయింది.
అక్రమాస్తుల కేసుల్లో ట్రయల్ ప్రారంభమై తీర్పు వస్తే ఆయన ఖాతాలో మరో ఎంత మంది ప్రముఖులు జైలుకు పోతారో చెప్పడం కష్టం. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్పుడు చేసిన నిర్వాకాల కారణం జైళ్లకు వెళ్లేవారు పెరుగుతున్నారు. పరారీలో ఉన్న వారి సంఖ్యకు లెక్కలేదు. ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరూ జైలు బాటపడుతున్నారు. వారంతా జగన్ పాపాల్లో భాగమయ్యారు కానీ.. అసలు పాపం చేసిన వారు కాదు. దోపిడీల్లో పావలా..అర్థ కోసం కక్కుర్తి పడి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.
ఇప్పటికి బయటపడాల్సిన అక్రమాలు చాలా ఉన్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు చాలా మంది నేతలు జైలు బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవాళ కాకపోతే రేపు అన్నట్లుగా వారి పరిస్థితి ఉంది. ఓ నాయకుడి స్వార్థానికి ఇంత మంది బలి అవడం.. ఆ నాయకుడి గురించి తెలిసి కూడా కక్కుర్తిపడిన వాళ్లదే తప్పు. ఇప్పటికైనా ఆ క్రిమినల్ మైండ్ సెంట్, ఇతరుల్ని బలి చేసి తాను సంపాదించుకోవాలనుకునే వ్యక్తిత్వం ఉన్న లీడర్ గురించి తెలుసుకుని మసలుకుంటే బెటర్ లేకపోతే రేపు జైలుకెళ్లి.. తప్పు చేశానని పశ్చాత్తాపం చెందితే ప్రయోజనం ఉండదు.