భారత్ మాతాకీ జై అని నినదించడం మాత్రమే దేశభక్తి కాదు. జాతి పితగా దేశం గుర్తించిన వారిని గౌరవించడం కూడా దేశ భక్తే. మన మూల పురుషుల్ని మనం కించపర్చుకుంటే ఇతర దేశాలు ఎందుకు గౌరవిస్తాయి ?. మన జాతిపిత గొప్పదనాన్ని మనం గుర్తించకపోతే ఎవరు మాత్రం ఎందుకు గుర్తిస్తారు? .
మహాత్మాగాంధీని నిందించడం ఇప్పుడో ఫ్యాషన్ !
మహాత్మాగాంధీని నిందించడాన్ని ఇప్పుడు కొంత ఓ ఫ్యాషన్ గా భావిస్తున్నారు. ఆయన చెప్పిన అహింసా సిద్ధాంతాన్ని ఎగతాళి చేస్తున్నారు. దేశ విభజనకు ఆయనే కారణం అని నిందిస్తున్నారు. కొంత మంది గాడ్సే ను పొగుడుతున్నారు. ఇలాంటివి ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. గాంధీ మహాత్ముడి సిద్ధాంతాల పవర్ గురించి .. అవి సాధించిన ఫలితాల గురించి కంటే కూడా ఆయన గురించి నెగెటివిటీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ లాంటి వారు చేరడం వల్ల ఇలాంటి ప్రచారం ఇంకా ఇంకా పెరుగుతోంది.
అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు !<
మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతం ప్రపంచాన్ని శాంతి వైపు మళ్లించింది. ఆయన అహింసాయుత విధానాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్నారు. హింస అంటూ ప్రారంభమైతే అది మానవాళి వినాశనానికి దారి తీస్తుంది. మహాత్మాగాంధీ స్వాతంత్ర్య పోరాటంలో అహింసా సిద్ధాంతం తీసుకోవడానికి కారణం ప్రజల ప్రాణాల్ని కాపాడటానికే. నాడు ఎదిరిస్తే ప్రాణాలు తీసేవారు. అలాంటి పరిస్థితులు లేకుండా.. కేవలం శాంతియుత పోరాటాల ద్వారానే లక్ష్యాలు సాధించాలనుకున్నారు. ఓ సినిమాలో చెప్పినట్లు నిశ్మబ్దమే అత్యంత భయంకరంగా ఉంటుంది.. అలాంటి భయంకరమైన నిశ్మబ్దాన్ని శాంతియుత పోరాటాల ద్వారా మహాత్ముడు సృష్టించాడు. దాని వల్ల భారత ప్రజల ప్రాణాలను కాపాడారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చారు. అది కళ్ల ముందు కనిపించే నిజం.
మహాత్ముడు చేసింది స్వాతంత్ర్య పోరాటం – టెర్రరిజంపై పోరు కాదు !
ఇక్కడ ప్రతీ విషయానికి మహాత్ముడి ప్రస్తావన తీసుకు వచ్చేవారికి చాలా విషయాలపై అవగాహన ఉండదు. మహాత్మగాంధీ చేసింది టెర్రరిజం పై పోరు కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం. రెండింటికి తేడా తెలియని వారు చాలా మాట్లాడుతూ ఉంటారు. ప్రతీ దానికి .. ఇప్పుడు జరుగుతున్న వాటికి మహాత్ముడికి ముడి పెడుతూంటారు. ఇది ఆయనపై పెంచుకున్న వ్యతిరేకతే తప్ప ఇంకేం కాదు. నాడు పాకిస్తాన్ ను ఏర్పాటు చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవో చరిత్ర కారులకే తెలుసు. కలిపి ఉంచేస్తే.. పాకిస్తాన్ ఉండేది కాదని చాలా మంది అనుకుంటారు. కానీ పాకిస్తాన్ అనేది భారత్ లో కలిసి ఉంటే ఇప్పటికి భారత్ మొత్తం ఓ అల్లకల్లోల దేశంగా ఉండేదనేది రక్షణ నిపుణులు చెప్పేమాట. అయినా పాకిస్తాన్ ఏర్పాటు అనేది మహాత్ముడి ఒక్కడి నిర్ణయం కాదు.
హింస అంటూ ప్రారంభిస్తే ఎక్కడ ఆగుతుంది ?
వాడు అవమానించాడు..నేను వెళ్లి కొట్టేసి వస్తా అని బయలుదేరితే ఆ హింస ఎక్కడ ఆగుతుంది?. ఎక్కడా ఆగదు. అలాగే కొట్టుకోవడం.. చంపుకోవడం కూడా ప్రారంభిస్తే దానికి అంతం ఎక్కడ ఉంటుంది ?. మహాత్మాగాంధీ ఇదే చెప్పారు. అయితే ఆయన ఉంటే టెర్రరిజం విషయంలో ఏం చేసేవారో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటి పరిస్థితులకు ఆయనే కారణం అని నిందించడం మాత్రం ఖచ్చితంగా దేశభక్తి కాదు. జాతిపితను..ఆయన విధానాలను..వాటి వల్ల వచ్చిన ఫలితాలను ఎప్పటికీ గౌరవించాల్సిందే. అది దేశభక్తిలో భాగం కూడా !