ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశాం.. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి రాలేదు. అలాగని పాకిస్తాన్ గీత దాటితే మాత్రం పరిణామాలు ఊహించలేరు అని సైనికాధికారులు సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ చాలా పద్దతిగానే చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం ప్రయత్నం చేసి మంట పెట్టుకుంది. దాని పరిణామాలు కూడా అనుభవిస్తోంది.
ఉదయమే కరాచి, లాహోర్, రావుల్ఫిండిల్లో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. డ్రోన్లు వచ్చి దాడులు చేసినట్లుగా పాకిస్తాన్ చెప్పింది. భారత్ మధ్యాహ్నానికి క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడులకు ప్రయత్నించిందని .. వాటిని తాము నిరోధించడంతో పాటు రివర్స్ లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై దాడి చేశామని ప్రకటించింది. మేమంటూ సొంతంగా ఏమీ చేయడం లేదని పాకిస్తాన్ చేసే ప్రయత్నాలకు మాత్రమే రివర్స్ కౌంటర్ ఉన్నామని భారత్ ప్రకటించింది.
పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తే వాటిని నిర్వీర్యం చేయడమే కాదు.. రివర్స్ లో అలాంటి దాడులు చేస్తామని భారత్ హెచ్చరికలు పంపింది. కరాచీ, లాహోర్, రావుల్పిండిల్లో భారత్ చేసిన డ్రోన్ దాడులతో పాకిస్తాన్ మొత్తం వణికిపోయింది. ఆ డ్రోన్లతో అసలైన లక్ష్యాలను టార్గెట్ చేసుకుంటే పరిస్థితేమిటని ఇతరులు వణికిపోతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ నాశనం అయ్యాయి. భారత్ దాడి చేయాలనుకుంటే.. ఎక్కడ కావాలంటే అక్కడ బాంబులు వేసి రాగలదు.
పాకిస్తాన్ భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను టార్గెట్ చేసిన డ్రోన్లు, మిస్సైళ్లను కూల్చివేశామని వాటి శిధిలాలను కూడా సేకరిస్తున్నామని వాటిని ఆధారాలుగా బయటపెడతామని తెలిపింది. ఈ అంశంపై పాకిస్తాన్ కుక్కిన పేనులా వ్యవహరిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారో తెలియడం లేదు. సైనిక సామర్థ్యం పరంగా వెనుకబడిన పాకిస్తాన్ కు భారత్ ఇస్తున్న రివర్స్ షాకులు .. మంటపుట్టిస్తున్నాయి.