చాలా కాలంగా ప్రతిపాదనలో ఉన్న సన్నబియ్యం పథకం ఏపీలో కార్యరూపం దాల్చబోతోంది. జూన్ 12 నుంచి సన్నబియ్యం పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
అయితే, ఈ సన్నబియ్యం పంపిణీని దశలవారీగా చేపట్టాలని నిర్ణయించింది ఏపీ సర్కార్. ఈ పథకం ప్రారంభ దశలో 41వేల ప్రభుత్వ పాఠశాలలు, 4వేల సంక్షేమ వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్నబియ్యంతో మిడ్ డే మిల్స్ అందించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు అందించిన తర్వాత రేషన్ కార్డుదారులకు ఈ సన్నబియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు సన్నబియ్యం స్టాక్ సిద్దం చేసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఇటీవల సన్నబియ్యం తెలంగాణలో పంపిణీ చేస్తున్నారని, ఏపీలో ఎప్పుడు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. తాము దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు.
ఈమేరకు ప్రారంభ దశలో విద్యార్థులకు ఆ తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. నిజానికి వైసీపీ సన్నబియ్యం ఇస్తామని గతంలో హామీ ఇచ్చి విస్మరించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టింది.