అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను మధ్యవర్తిత్వం వహించి భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరింప చేశానని ప్రకటించారు.అయితే ఆ తర్వాత ప్రకటన చేసిన పాకిస్తాన్ కానీ.. భారత్ కానీ ఇందులో అమెరికా ప్రమేయం ఉందని చెప్పలేదు. ట్రంప్ ఈ ట్వీట్ చేసిన కాసేపటికే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించామని ట్వీట్ చేశారు. ఆయన అందులో అమెరికా ఆధ్వర్యంలో చర్చలు జరిగాయని చెప్పలేదు.
కాసేపటికి భారత విదేశాంగ కార్యదర్శి మిస్త్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన అమెరికా దౌత్యం ఇందులో ఉందని చెప్పలేదు. పాకిస్తాన్ డీజీఎంఓ ఈరోజు మధ్యాహ్నం 15:35 గంటలకు భారత డీజీఎంఓకు ఫోన్ చేశారని కాల్పుల విరమణకు ప్రతిపాదించారని అన్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుండి భూమి, వాయు, సముద్రంపై కాల్పులు, సైనిక చర్యలను ఇరుపక్షాలు నిలిపివేస్తాయని వారు అంగీకరించారని తెలిపారు. ఈ ఒప్పందాన్ని అమలు చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయని తెలిపారు.
మే 12న మధ్యాహ్నం 12 గంటలకు వారు మళ్ళీ చర్చించుకుంటారని తెలిపారు. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కాల్పులు , సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం రెండు దేశాల మధ్య నేరుగా తీసుకున్నాయని మిస్త్రీ స్పష్టం చేశారు. మరే ఇతర అంశంపై మరే ఇతర ప్రదేశంలో చర్చలు జరపలేదన్నారు. అంటే ట్రంప్ జోక్యాన్ని భారత్ ఖండించినట్లే అనుకోవచ్చు. కశ్మీర్ అంశంలో కానీ.. మరే ఇతర అంశంలోనూ భారత్ ఇతర దేశాల వద్దకు మధ్యవర్తిత్వంకు వెళ్లదు. ఇదిభారత విధానం కాదు. అందుకే.. అమెరికా చొరవ ఉన్నా.. తామే నిర్ణయం తీసుకున్నట్లుగా రెండు దేశాలు ప్రకటించాయని అనుకోవచ్చు.
కానీ ముందుగా ట్రంప్ ప్రకటించుకున్నారు. తామే దౌత్యం చేశామన్నారు. రాత్రంగా చర్చలు జరిపామన్నారు. క్రెడిట్ కొట్టేశారు.