కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా అమెరికా ప్రకటించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం చేసిందనేది బహిరంగ నిజం. అయితే ఆ మధ్యవర్తిత్వం చేసింది పాకిస్తాన్ తోనే. భారత్ కాళ్లు పట్టుకుని అయినా కాల్పుల విరమణ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. ఆ మేరకు బారత్ కు పాక్ ఆర్మీ అధికారులు ఫోన్ చేసి బతిమాలుకున్నారు. చివరికి ఒప్పందం జరిగింది.
పాకిస్తాన్ ను అలా వదిలేయడం మంచిది కాదన్న భావన
పాకిస్తాన్ బలహీనంగా ఉందని .. అటు ఆర్థిక పరిస్థితితో పాటు.. ఇటు ఆర్మీ కూడా బలహీనంగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేయడం మంచిది కాదని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. ఓ వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు.. మరో వైపు ఆప్ఘన్ సరిహద్దుల్లో తాలిబన్ల అలజడితో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సరైన సమయమని నెత్తి మీద రెండు కొట్టి…భూమిలోకి తొక్కేయాలని సలహాలిస్తూ వచ్చారు ఇప్పుడు అది జరగకపోవడంతో నీలుగుతున్నారు. కానీ యుద్ధం అనేది ఒక వైపు మాత్రమే జరగదని..రెండు వైపులా నష్టం ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
1971 నాటి యుద్ధ పరిస్థితులు.. ఇప్పటివీ ఒక్కటేనా ?
ఇందిరాగాంధీ భారత్ కు చెందిన గొప్ప నాయకుల్లో ఒకరు. అందులో సందేహం లేదు. ఆమె నాయకత్వంలో భారత విజయాల్ని ఎవరూ తక్కువ చేయడం లేదు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాల్ని అప్పటి ఘటనలతో ముడిపెట్టి.. పాలకుల్ని విమర్శించడం మాత్రం మతిలేని చర్య అనుకోవచ్చు. యాభై పదేళ్ల కిందట పరిస్థితులు.. ఇప్పటి పరిస్థితులు ఎలా ఒకటి అవుతాయి ?. అప్పట్లో భారత్ విజయం సాధించింది. కానీ యుద్ధం అంటేనే వినాశనం. అప్పటి యుద్ధంలో భారత్ కు సైనిక పరంగానే నష్టం జరిగింది.కానీ ఇప్పుడు యుద్ధం అంటూ వస్తే భారత్ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడుతుంది. గ్లోబల్ మార్కెట్లలో మనదైన ముద్ర వేస్తున్నాం. అందుకే ఇప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
ఎవరైనా దేశం కోసమే – నిందించడం ఆపేయాలి !
భారతీయుల దేశభక్తిని భారతీయులే శంకించడం అనేది తప్పుడు పని . దేశం కోసం తీసుకున్న నిర్ణయాలను స్వాగతించాలి. సమర్థించాలి. అంతే కాదు గతంలో ఇలా చేశారు.. అలా చేశారని ఎప్పటి పరిస్థితులనో ఇప్పటికి అన్వయించి.. పాలకుల్ని బలహీనపర్చడం అనేది.. మంచిది కాదు. పాలకులు ఎంత సమర్థంగా ఉంటే.. భారత్ అంత సురక్షితంగా ఉంటుంది. పాకిస్తాన్ ,చైనా లాంటి పొరుగుదేశాలు ఉన్నప్పుడు ఇంకా చాలా కీలకం. తెలుసుకుంటారని అనుకుందాం !