తెలంగాణ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కీలక మార్పులు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ అంటే చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. రోజంతా నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. 47 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో మొత్తం 144 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. వచ్చే నెల చివరి నాటికి అన్ని చోట్ల ఈ స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
త్వరగా.. సమర్థవంతంగా సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తారు. సాధారణంగా రోజుకు 48 స్లాట్లు ఉంటే సబ్ రిజిస్ట్రార్ కు పని ఒత్తిడి ఉండదు. అంత కంటే ఎక్కువ స్లాట్లు బుక్ అయ్యే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను, సిబ్బందిని నియమించారు.
త్వరలో ఉప్పల్, మహేశ్వరం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా అదనపు సబ్ రిజిస్ట్రార్‌ను నియమించనున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కల్పించే వాటిలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కీలకంగా ఉన్నాయి. అక్కడ ఉన్న సమస్యల వల్ల ఆదాయం పెరగడంలేదు. అందుకే ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టాలని అనుకుంటోంది.