భారత్,పాక్ యుద్ధాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ రోజూ మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు. నిజానికి భారత్, పాక్ కాల్పుల విరమణ పాటించబోతున్నాయని ప్రకటించిన నేత ట్రంప్. తానే రోజంతా మధ్యవర్తిత్వం వహించానని చెప్పుకున్నారు. ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే రెండుదేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. దీంతో ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం అంతా ఆయన దౌత్యమే కారణమనుకున్నారు. కానీ అటు భారత్, ఇటు పాకిస్తాన్ రెండు దేశాలు ట్రంప్ యుద్దాన్ని తప్పించారని చెప్పలేదు. తామే చర్చించుకున్నామని చెప్పుకొచ్చారు.
బ్లాక్ మెయిల్ చేస్తున్న ట్రంప్
భారత్, పాక్ రెండూ తన గుప్పిట్లో ఉన్నట్లుగా ఉద్రిక్తతలు తగ్గించకపోతే రెండు దేశాలతో అమెరికా వాణిజ్యాన్ని ఆపేస్తానన్నట్లుగా బెదిరించానని వాళ్లు దారికొచ్చేశారని ట్రంప్ చెబుతున్నారు. వాణిజ్యం అంటే రెండు వైపులా జరిగేదన్న సంగతి ఆయనకు గుర్తు లేదు. ఇప్పటికే చైనాతో పెట్టుకుని.. మళ్లీ ఆ దేశంతో టారిఫ్ లు తగ్గించుకుందామని చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు భారత్ జోలికి వస్తే పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. అయినా..తాను వాణిజ్యం ఆపేస్తానని చెప్పి బెదిరించి ఉద్రిక్తతలు తగ్గించానని.. అణుదాడులు జరగకుండా చూశానని చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతికి బాటలు వేసుకుంటున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందంలో ట్రంప్ ప్రమేయాన్ని నిర్దారించని భారత్
పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్రంప్ ప్రమేయం ఉందని భారత్ ఇంత వరకూ ఒక్క మాట చెప్పలేదు. అమెరికా సమక్షంలో చర్చలు జరిగాయని కూడా చెప్పలేదు. నేరుగా పాక్ ఆర్మీ నుంచే ప్రతిపాదన వచ్చిందని చెబుతున్నారు. అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని అంటున్నారు. ప్రధాని మోదీ కూడా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో అమెరికా ప్రమేయం ఉందని కానీ ట్రంప్ తో చర్చించామని కానీ చెప్పలేదు. పైగా ఎవరి మధ్యవర్తిత్వం అక్కర్లేదని చర్చలు జరిగేది.. పాకిస్తాన్ ప్రేరేపించే ఉగ్రవాదం.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అప్పగింతపైనేనని అంటున్నారు అంటే అమెరికా ప్రమేయాన్ని భారత్ అంగీకరించడం లేదు.
మరి ట్రంప్ గొప్పలకు భారత్ సమాధానం ఏమిటి ?
ట్రంప్ ఇలా తనను తాను పొగుడుకుంటూ.. అదని..ఇదని చెప్పుకుంటున్నారు. ఇందు కోసం భారత్ పేరుని వాడేస్తున్నారు. దీనికి.. భారత్ వైపు నుంచి గట్టి స్పందన రావడంలేదు. ట్రంప్ ను తన పని తాను చూసుకోవాలని గట్టిగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని ప్రజలు హర్షించరు. ఆ విషయాన్ని భారత నాయకత్వం గట్టిగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది.