వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రజాధనాన్ని సొంత ధనంలాగా ఖర్చు పెట్టుకున్నారు. తమ రాజకీయాల కోసం వందల కోట్లు ధారాళంగా తమ కంపెనీల్లోకి ప్రవహించ చేసుకున్నారు. ఇలా భారీగా వందల కోట్లలో లబ్ది పొందిన కంపెనీల్లో ఒకటి ఐ ప్యాక్. 2019లో జగన్ రెడ్డి గెలవడానికి కారణం అయిన ఐ ప్యాక్ ఆ తర్వాత ప్రభుత్వంలో భాగంగా మారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించింది. ప్రతి వ్యవస్థలోనూ తన మనిషిని పెట్టింది. వైసీపీ కార్యక్రమాలకు ప్రభుత్వం ముసుగు తొడిగి డబ్బులు కాజేసింది. ఇప్పుడు ఆ ఐ ప్యాక్ వ్యవహారం వెలుగులోకి వస్తోంది.
ఐ ప్యాక్ కు వందల కోట్ల నిధులు చెల్లించినట్లుగా గుర్తించారు. అయితే నేరుగా కాదు .. రామ్ ఇన్ఫో అనే కంపెనీ ద్వారా చెల్లించారు. ఈ కంపెనీ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చామని చెప్పుకుంది. ఆ పేరుతో రామ్ ఇన్ ఫోకు ఇచ్చారు. అక్కడ్నుంచి ఐ ప్యాక్ తీసుకుంది. ఇలా చాలా లింకులు ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని ప్రభుత్వ డబ్బులతో నిర్వహించారు.. చివరికి సిద్ధం అనే పేరుతో నిర్వహించిన సభలకు కూడా ప్రజల డబ్బులనే వాడారు. ఇలాంటి వాటికి పెద్ద ఎత్తున నిధుల్ని మళ్లించారు.
ఐ ప్యాక్ సేవలు చాలా ఖరీదైనవి. ప్రభుత్వంలో ఉండగా .. ఇక అడ్డేముందని అనుకుని వందల కోట్లు కొట్టేశారు. ఇప్పుడు ఐ ప్యాక్ సేవలు వైసీపీకి అందుతున్నాయా లేదా అన్నది తెలియడం లేదు. అసలు ఐ ప్యాక్ ఉందా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. వ్యవస్థాపకులలో ఒకరు అయిన ప్రశాంత్ కిషోర్ ఆ సంస్థ నుంచి వైదొలిగిన చాలా కాలం అయింది. ఆయన ఎవరికైనా పని చేయాలంటే వ్యక్తిగతంగా పని చేస్తున్నారు. ఇప్పుడీ ఐ ప్యాక్ దోపిడీని ప్రభుత్వం బయటకు తీసి.. నిందితుల్ని కటకటాల వెనక్కి పంపనుంది. ప్రజాధనాన్ని ఎంత ఘోరంగా దోచారో ప్రజల ముందు పెట్టనుంది.