ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘మహాకాళి’. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమా ఇది. పూజా కొల్లూరు దర్శకురాలు. ఇది వరకు ‘మార్టిన్ లూథరన్ కింగ్’ అనే సినిమా తీశారీమె. సోమవారం క్లాప్ కొట్టారు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నాని ఎంచుకొన్నారు. ఇటీవల ‘చావా’లో ఔరంగజేబ్ పాత్రని పోషించారు అక్షయ్. ఆ పాత్రలో నటనకు ప్రశంసలు దక్కాయి. అక్షయ్ ఖన్నా కెరీర్లో ఇది ఓ మేలిమి మలుపు లాంటి పాత్ర. ఆ సినిమా తరవాత అక్షయ్‌కు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ‘మహాకాళి’లో పాత్ర ఆయన్ను ఆకట్టుకొంది.
మహాకాళిగా ఎవరు కనిపిస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ కావాలి. ప్రశాంత్ వర్మ కూడా కొంతమందిని సంప్రదించాడు. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అనుపమ పరమేశ్వరన్, రష్మిక లాంటి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ పాత్ర ఎవరు చేసినా బల్క్ డేట్లు కావాలి. అలా ఇచ్చే వాళ్లు కరువయ్యారు. స్టార్ హీరోయిన్ దొరక్కపోతే, రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న కథానాయికతో అయినా సర్దుకుపోదామని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో `మహాకాళి` కూడా ఓ భాగమే. ఆయన ఇది వరకు తీసిన `హనుమాన్`తో పాటుగా తీయబోయే `అధీర`లోని పాత్రలు కూడా ఈ యూనివర్స్‌లో కలుస్తాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.