గత వారం విడుదలైన ‘సింగిల్’ మంచి విజయాన్ని అందుకొంది. కమర్షియల్ గా నిర్మాణ సంస్థకు లాభాల్ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా నిర్మాణంలో గీతా ఆర్ట్స్ పాలు పంచుకొంది. ఇప్పుడు మళ్లీ శ్రీవిష్ణుతో గీతా ఆర్ట్స్ ఓ సినిమాని రూపొందించే పనిలో పడింది. ‘ఆయ్’తో ఆకట్టుకొన్న దర్శకుడు అంజి. జీఏ 2లో రూపొందించిన ఆ సినిమా బాగానే ఆడింది. అయితే ఆ తరవాత అంజి సినిమా ఏమిటన్న విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు శ్రీవిష్ణు – అంజి కాంబోలో ఓ సినిమాని రూపొందించడానికి ప్లాన్ చేస్తోంది. కథ కూడా ఆల్రెడీ సెట్ అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘సింగిల్’ విజయంతో శ్రీవిష్ణు మళ్లీ ఫామ్ అందుకొన్నాడు. ‘సామజవరగమన’ తరవాత తనకు దక్కిన మరో హిట్ ఇది. ఎంటర్టైన్మెంట్ సినిమాలు శ్రీవిష్ణుకి బాగా కలిసొస్తాయని ‘సింగిల్’ నిరూపించింది. అందుకే తన దగ్గరకు అలాంటి కథలే వస్తున్నాయి. ‘ఆయ్’లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అంజి కామెడీ కథలు, సన్నివేశాలు బాగా రాస్తాడు. అలాంటి కథతోనే శ్రీవిష్ణుని అప్రోచ్ అయినట్టు సమాచారం. జీఏ 2 కాబట్టి బడ్జెట్ కు పెద్దగా అభ్యంతరాలు ఉండవు. కాకపోతే శ్రీవిష్ణు లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. తను ఇది వరకే ఒప్పుకొన్న కథలు కొన్ని ఉన్నాయి. వాటి మధ్య ‘ఆయ్’ దర్శకుడితో సినిమా ఎప్పుడుంటుంది? అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి.