హైదరాబాద్ శివారులోని అది కూడా ఐటీ కారిడార్ కు దగ్గరగా తక్కువ ధరకు ఇళ్లు, అపార్టుమెంట్లు, ప్లాట్లు వచ్చే ఏరియాలు హాట్ కేక్‌లుగా ఉంటాయి. అయితే కొన్ని ప్రాంతాలకు పెద్దగా ప్రచారం ఉండదు. అలాంటి వాటిలో ఒకటి కిస్మత్ పూర్. గండిపేట మండలంలో హిమాయత్‌సాగర్ సమీపంలో కిస్మత్ పూర్ ఉంది. అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ రోడ్ తో పాటు ఔటర్ ద్వారా సులువుగా చేరుకోవచ్చు.
మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతంగా కిస్మత్ పూర్ గుర్తింపు పొందుతోంది. భారీగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ధరలు మాత్రం ఐటీ కారిడార్ తో పోటీపడటం లేదు. ఇక్కడ Sftకి ఐదు నుంచి ఏడు వేల ధరలు చెబుతున్నారు. డిమాండ్ బాగుండటంతో గేటెడ్ కమ్యూనిటీల దగ్గర నుంచి చిన్న బిల్డర్లు నిర్మించే అపార్టుమెంట్ల వరకూ జోరుగానే నిర్మాణఆలు సాగుతున్నాయి.
కొన్ని బడా సంస్థలు కూడా ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించాయి. సాకేత్ శ్రీయమ్, శ్రీ రామ్ ఎస్టేట్స్, వసంత్ సిటీ వంటివి నిర్మాణంలో ఉన్నాయి. ప్రెస్టీజ్ ట్రాన్క్విల్ , అపర్ణా సంస్థ కూడా విల్లాలు నిర్మిస్తోంది. సైజును బట్టి కోటిన్నర నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే కిస్మత్ పూర్ అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉంది. ఇంటర్నేషనల్ స్కూల్, కార్పొరేట్ ఆస్పత్రులు ఉన్నాయి. అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లో ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ.. ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ రేటుకే అందుబాటులో ఉన్నాయని అనుకోవచ్చు. హైదరాబాద్ శివారులో ఇల్లు కొనాలనుకుంటున్న వారు ఓ లుక్ వేయదగ్గ ప్రాంతం కిస్మత్ పూర్.