రియల్ ఎస్టేట్ ఊపందుకోవాలంటే.. అన్నీ కలసి రావాలి. అలాంటి వాటిల్లో ఒకటి హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు. హోమ్ లోన్ వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటే.. ప్రత్యేకంగా ఇళ్లు కొనాలనుకునేవాళ్లు ముందుకు వస్తారు. లేకపోతే ఆలోచిస్తారు. వడ్డీరేట్లను గత రెండు త్రైమాసికాల్లో ఆర్బీఐ తగ్గించింది. దీంతో బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న లోన్లపై తగ్గిస్తున్నాయి. కొత్తగా ఇచ్చే లోన్లపై ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే డిమాండ్ మాత్రం గతంలోలా ఊపందుకోవడం లేదు.
హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు రెండు దఫాలుగా తగ్గించినప్పటికీ ఇప్పటికీ కాస్త ఎక్కువగానే ఉన్నాయని భావిస్తున్నారు. కనీసం ఎనిమిది శాతానికి వస్తే ఎక్కువ మంది ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. ద్రోవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. పెరగడం లేదు. ఈ ఏడాది వర్షాలు కూడా ఆశాజనకంగా ఉంటాయన్న ప్రచారం జరుగుతూండటంతో.. మార్కెట్ బాగుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. వడ్డీ రేట్లు మరింతగా తగ్గించే అవకాశం ఉంది.
రియల్ ఎస్టేట్ వృద్ధి అనేది ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఈ రంగం కళకళలాడితే చాలా వ్యాపారాలు కళకళలాడుతాయి. ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అదే డీలా పడితే సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందుకే రియల్ రంగం వృద్ది చెందాలని ఎక్కువ మంది కోరుకుంటున్నారు. దానికి పరిస్థితులు కూడా కలసి రావాల్సి ఉంది.