భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనేలేదు.. మరోవైపు నుంచి చైనా భారత్ ను రెచ్చగొట్టే చర్యలకు దిగింది. దేశ సార్వభౌమత్వంపై దాడి చేసేలా వ్యవహరిస్తోంది. డ్రాగన్ కంత్రీ వైఖరిని తిప్పికొడుతూ భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటూ మరోసారి చైనా చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈసారి అరుణాచల్ ప్రదేశ్ కు కొత్త పేరు కూడా పెట్టేసింది. జంగ్నాన్ గా వ్యవహరిస్తూ టిబెట్ దక్షిణ ప్రాంతం అంటూ అరుణాచల్ ప్రదేశ్ ను తన మ్యాప్ లో ప్రదర్శించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. పేర్లు మార్చుకున్నంత మాత్రానా.. నిజాలు అబద్దాలు అవుతాయా? అంటూ చైనాకు కౌంటర్ ఇచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్ పై చాలా కాలంగా భారత్ – చైనా మధ్య వివాదం నడుస్తోంది. ఇప్పటికే టిబెట్ ను తనలో కలిపేసుకున్న చైనా.. తన ఫోకస్ ను అరుణాచల్ ప్రదేశ్ పై పెట్టింది. అందులో భాగంగా అప్పుడప్పుడు భారత్ ను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తోంది. ఎనిమిదేళ్లుగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు చైనీస్ లాంగ్వేజ్ లో పేర్లు కూడా పెడుతోంది.
2017లో 6 ప్రదేశాల పేర్లను మార్చింది. దీని తర్వాత, 2021లో 15 ప్రదేశాల పేర్లను మార్చారు. ఆ తరువాత 2023లో 11, 2024లో గరిష్టంగా 30 ప్రదేశాల పేర్లను మార్చారు. ఇందులో పర్వతాలు, నదులు, సరస్సులు, నివాస ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని చైనా ప్రాంతంగా గుర్తిస్తూ మ్యాప్ ను విడుదల చేసింది డ్రాగన్ కంత్రీ. దీనిపై భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
అయితే,పాక్ – భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలోనే చైనా ఈ అరుణాచల్ ప్రదేశ్ పై వివాదాస్పదంగా వ్యవహరించడంపై చర్చ జరుగుతోంది.