వాణిజ్యం అనేది దయాదాక్షిణ్యాలపై నడవదు. వ్యాపారం లాభనష్టాల మీదనే నడుస్తుంది. భారత్ జాలిపడి ఓ దేశం నుంచి వస్తువులు కొనుగోలు చేయదు. అలాగే భారత్ నుంచి ఇతర దేశాలు జాలిపడి..లేకపోతే మిత్రదేశం అనో కొనుగోలు చేయవు. తమకు తక్కువకు వస్తాయని.. లాభదాయకం అని భావిస్తేనే కొంటాయి. అమ్ముతాయి. ఇలాంటి సందర్భాల్లో ఇతర అంశాల్లో ఆయా దేశాలతో విబేధాలు వచ్చాయని బాయ్ కాట్ నినాదాలు ఇస్తే.. ఫలితాలు రావడం కష్టమే.
బాయ్ కాట్ నినాదం అనుకున్నంత ఏకపక్షం కాదు !
బాయ్ కాట్.. ఇప్పుడు సోషల్ మీడియాకు అత్యంత ఇష్టమైన పదం. ఎవరైనా ఇష్టం లేకపోతే బాయ్ కాట్ అనేస్తున్నారు. గతంలో చాలా వ్యాపార సంస్థల మీద.. సినిమాల మీద వీటిని ప్రయోగించారు. నిజం చెప్పాలంటే ఈ ప్రభావం వల్ల కొన్ని బడా కంపెనీలు నాశనం అయిపోయాయి కూడా. స్నాప్ డీల్ ఒకప్పుడు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ తో పోటీగా ఉండేది. అమీర్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారని ఓ వివాదంలో ..బాయ్ కాట్ నినాదం ఇచ్చారు. ఆ దెబ్బకు ఇతర సమస్యలు తోడవడంతో ఇప్పుడు స్నాప్ డీల్ లేకుండా పోయింది. అయితే ఈ బాయ్ కాట్ నినాదం రాను రాను రొటీన్ గా మారిపోయింది. ఇప్పుడు. దేశాల మీదకు వెళ్తోంది. అసువుగా బాయ్ కాట్ అంటున్నారు. కానీ ప్రపంచీకరణ జరిగిపోయిన సమయంలో ఇలాంటి బాయ్ కాట్స్ పిలుపుల ప్రభావం చాలా స్వల్పంగా ఉంటుంది.
బాయ్ కాట్ టర్కీ నినాదం ఇప్పుడు ట్రెండింగ్
భారత్, పాక్ ఘర్షణల్లో పాకిస్తాన్ కు టర్కీ అండగా నిలిచింది. సైనిక సాయం చేసింది. దొంగ తనంగా ఏమీ చేయలేదు. అంతా నేరుగానే చేసింది. ఇంకా కావాలంటే ఎలాంటి సాయమైనా చేస్తామని చెప్పింది. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు భారత్ సాయం చేసిందని అయినా పాకిస్తాన్ కు టర్కీ సాయం చేసిందని బాయ్ కాట్ పిలుపునిచ్చారు. ఆ దేశానికి టూర్లకు వెళ్లేవారు.. టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇది బాగానే ఉన్నా.. అసలు టర్కీని బాయ్ కాట్ చేయడం సాధ్యంకాదు. ఎందుకంటే టర్కీ నుంచి భారత్ కు ఇస్తున్నది నాలుగు బిలియన్ డాలర్ల వస్తువులు అయితే.. ఇండియా నుంచి టర్కీకి ఎగుమతి చేస్తున్నది పదకొండు బిలియన్ డాలర్ల వస్తువులు. ఎలా చూసినా టర్కీ నుంచి భారత్ కు విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. అటు వాళ్లు కూడా ఆపలేరు.. ఇటు మనం కూడా పూర్తి స్థాయిలో ఆపలేం. ఇస్తాంబుల్ ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రపంచ రాజధానిగా మారింది. జుట్టును తమ జీవితంలో అతిపెద్ద సమస్యగా భావించేవారు అక్కడికి వెళ్లకుండా ఉండగలరా?.
చైనా వస్తువుల్ని ఎంత వరకూ బ్యాన్ చేయగలిగాం ?
చైనా చిరకాల శత్రువుగా మారింది. ఇప్పటికి ఎన్ని సార్లు బాయ్ కాట్ చైనా నినాదం ఇచ్చామో లెక్కే లేదు. కానీ ఇప్పటికీ చైనాతో వాణిజ్యం పెరుగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే.. చైనా తన వస్తువులతో ఇండియాను ముంచెత్తుతోంది.కానీ దేన్నీ అడ్డుకోలేకపోతున్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగానే చైనా వస్తువుల విప్లవాన్ని అడ్డుకోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది. కానీ ప్రయోజనాలు స్వల్పమే. మన అవసరాలే.. చైనాకు ఓ గొప్ప వరంగా మారుతున్నాయి.
స్వయం సమృద్ధి సాధించినప్పుడే సాధ్యం !
ఏ విషయంలో అయినా ఇతర దేశాలపై ఆధారపడకుండా.. దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు.. ప్రపంచ దేశాలకు అవసరం అయినా వస్తువుల్ని మనం ఉత్పాదన చేసినప్పుడే… మన పట్టు నిలబడుతుంది. అలాంటి సమయాల్లో సరైనా భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే.. బాయ్ కాట్ హెచ్చరికలు చేసినా వర్కవుట్ అవుతుంది. లేకపోతే ఆ పిలుపులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ కే పనికి వస్తాయి.