హైడ్రా…దేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో జీవించలేని పరిస్థితులు తలెత్తాయని, అలాంటి పరిస్థితి హైదరాబాద్ కు రావొద్దని సదుద్దేశంతో రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ. మొదట్లో ముందస్తు ప్లాన్ లేక , ప్రజలకు హైడ్రాపై అవగాహనా కల్పించడంలో అధికారులు , ప్రభుత్వ పెద్దలు ఫెయిల్ కావడంతో హైడ్రా అంటేనే నిరుపేదల నివాసాలను ధ్వంసం చేసేందుకు ఏర్పాటు చేసినదని పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.
అయినా ఓ దీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ కావడంతో ఎన్ని విమర్శలు వచ్చినా రేవంత్ మాత్రం హైడ్రా విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇటీవల హైడ్రా పోలీసు స్టేషన్ ను కూడా ప్రారంభించారు. దీంతో మరిన్ని కూల్చివేతలు ఉంటాయనే ఆందోళన వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో హైడ్రా విశ్వసనీయత పెరిగే పరిణామం ఒకటి చోటు చేసుకోబోతోంది.
హైదరాబాద్ అంబర్ పేట్ లోని బతుకమ్మకుంటను కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా కదిలింది. మొదట్లో బతుకమ్మకుంట పునరుజ్జీవనం అసాధ్యం అని అంతా అనుకున్నారు.దీనీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బతుకమ్మకుంట పునరుద్దనరణ పనులు ప్రారంభం అయ్యాయి.ఇందుకోసం 7కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఇటీవల కొద్ది లోతు మట్టి తీయగానే చెరువు ఆనవాళ్లు బయటపడ్డాయి. దసరా నాటికి చెరువుకు ప్రాణం పోస్తామని అధికారులు స్పష్టం చేశారు.
1962కు పూర్వం 26ఎకరాలు ఉన్నది ఈ బతుకమ్మ కుంట. ఆ తర్వాత కబ్జాదారుల కన్ను పడటంతో కాలక్రమంలో అది కుంచించుకుపోయింది.ప్రస్తుతం అది 5.15ఎకరాలకు తగ్గింది. కబ్జాదారులకు నేతల అండదండలు ఉండటంతో ఈ బతుకమ్మకుంట పరిరక్షణపై ఎవరూ నోరెత్తలేదు. ఈ చెరువు మరింత కుంచించుకుపోవడంతో వర్షాకాలంలో వర్షపునీరు రోడ్లపై నిలవడం, స్థానికంగా ఉన్న చెంచుల నివాసాలు జలమయం కావడం ప్రతి ఏడూ జరుగుతోంది. అయినా శాశ్వత సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టలేదు.
ఈ క్రమంలోనే రేవంత్ అధికారంలోకి వచ్చాక నగరంలోని చెరువులను కాపాడటం, వరద బారి నుంచి నగరాన్ని రక్షించేందుకు తీసుకొచ్చిన హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా బతుకమ్మకుంట తిరిగి ప్రాణం పోసుకుంటోంది. పునరుద్దరణ పనులు ప్రారంభం కావడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కబ్జాల పర్వంతో మరికొద్ది కాలంలో ఈ బతుకమ్మకుంట కనుమరుగు అవుతుందని అనుకుంటే.. హైడ్రా ద్వారా పునరుజ్జీవం పోసుకుందని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండగనాటికి ఈ బతుకమ్మ కుంట అందుబాటులోకి వస్తే హైడ్రాకు బలం పెరగనుంది.