లిక్కర్ స్కాంలో కింగ్పిన్లకు అత్యంత సన్నిహితులు అయిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో వారు ఇక అరెస్టు కావడం మినహా మరో మార్గం లేదు. ఇప్పటికే బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. వీరిద్దరికీ మాత్రం ఇప్పటి వరకూ రిలీఫ్ ఉంది. అందుకే రెండు రోజుల నుంచి విచారణకు హాజరు అవుతున్నారు.
ప్రస్తుతం బెయిల్ ఇస్తే.. విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే.. దిగువ కోర్టులు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రెండు రోజుల నుంచి వీరిద్దరూ విచారణకు హాజరవుతున్నారు కానీ ఎలాంటి వివరాలు చెప్పడం లేదు. పైగా దర్యాప్తు అధికారుల్ని ఎదురు బెదిరిస్తున్నారని అంటున్నారు.ఈ రోజు కూడా విచారణకు హాజరయ్యారు. వారిని విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.
లిక్కర్ స్కాం విచారణ కీలక దశకు చేరుకుంటోంది. ఈడీ కూడా ఎ వన్ నిందితుడు అయిన రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు కోర్టు అనుమతి కోరింది. వచ్చే వారం రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.