ప్రధానమంత్రి నరేంద్రమోదీతో నారా లోకేష్ సమావేశం ఖరారు అయింది. శనివారం నారా లోకేష్ కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో ఆయనతో సమావేశం కానున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ .. ప్రధాని మోదీతో సమావేశం కాలేదు. స్వయంగా ప్రధాని మోదీ తనతో సమావేశానికి ఎందుకు రావడం లేదని రెండు సార్లు ప్రశ్నించారు. రెండు సార్లు ఏపీ పర్యటనలో సరదాగా నారా లోకేష్ ను ప్రశ్నించారు. రెండు సార్లు త్వరలోనే వచ్చి కలుస్తానని నారా లోకేష్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ .. పాకిస్తాన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య అత్యంత బిజీగా ఉండటంతో ఇటీవలి కాలంలో కుదరలేదు. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడంతో నారా లోకేష్ అపాయింట్ మెంట్ ఖరారు అయింది. నారాలోకేష్ తో పాటు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఉండే అవకాశం ఉంది. ప్రధాని మోదీ .. నారా లోకేష్ పై ప్రత్యేక అభిమానం చూపిస్తూంటారు. ఈ అభిమానం వల్లనే కుటుంబంతో సహా రావాలని ఆయన ఆహ్వానిస్తూ వస్తున్నారు.
ప్రధాని మోదీతో లోకేష్ సమావేశం పూర్తిగా వ్యక్తిగతమైనదేనని.. ఇందులో అధికారిక, రాజకీయ అంశాలు చర్చించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ప్రధానితో భేటీకి సరైన సమయం కోసం నారా లోకేష్ చూస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ పై యుద్ధ పరిస్థితుల్లో నెగ్గిన వాతావరణంలో లోకేష్ పర్యటన మరింత ఉత్సాహంగా సాగే అవకాశం ఉంది.