మనకున్న టాలెంటెడ్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకడు. తన సినిమాలు, అందులో తన వర్క్ చెబుతాయి… వంశీ ప్రతిభ ఏంటో. ఊపిరి, మహర్షి, వారసుడు.. ఇలా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చాడు వంశీ. కానీ సడన్ గా సైలెంట్ అయిపోయాడు. వంశీ నుంచి సినిమా వచ్చి రెండేళ్లు దాటేసింది. అయినా తదుపరి సినిమా గురించి అప్ డేట్ లేదు. వంశీ దగ్గర ఉన్న ఇబ్బంది ఏమిటంటే, తనకు స్టార్ హీరోలు కావాలి. వాళ్లేమో అందుబాటులో లేకుండా పోయారు. బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకొందామనుకొన్నాడు వంశీ. అమీర్ ఖాన్ లాంటి స్టార్లతో కూడా సంప్రదింపులు జరిగాయి. కానీ వర్కవుట్ కాలేదు. బడా హీరోలతో ఉన్న సమస్యే ఇది. నాలుగైదు సినిమాలు లైనప్లో ఉంటాయి. వాటిలో ఒక్కటి పక్కకు జరిపి, మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే వంశీకి ఇప్పుడు హీరోలు దొరకడం లేదు.
యావరేజ్ సినిమాలు తీసిన దర్శకులే.. ఇప్పుడు ఖాళీగా లేరు. ఏదో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకొంటున్నారు. అలాంటిది.. మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్లతో హిట్లు కొట్టి కూడా ఖాళీగా ఉండడం ఇబ్బందికరమే. వంశీ కాస్త తగ్గి, మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసుకొన్నా ఎవరి అక్షేపణా ఉండదు. కానీ సడన్ గా కాస్త తగ్గితే – మార్కెట్ ఏమనుకొంటుందో అనే భయం వంశీలో ఉందేమో? అందుకే ఏళ్లు గడిచిపోతున్నా..’స్టార్ హీరో కావాల్సిందే’ అని మంకి పట్టు పట్టుకొన్నాడు. ఈ విషయంలో వంశీ కాస్త ఆలోచించుకొంటే.. తనతో పని చేయడానికి టైర్ 2 హీరోలు సిద్ధంగానే ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒక్క సినిమా కూడా బయటకు రాకపోతే… రాసుకొన్న కథలు, చూపించాలనుకొంటున్న పాత్రలూ మరుగున పడిపోయే ప్రమాదం ఉంది. సుదీర్ఘమైన విరామం తరవాత సినిమా చేస్తే.. ఆ ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ విషయంలో వంశీ కాస్త ఆలోచించుకొంటే మంచిది. హీరోలు దొరకనప్పుడు, దొరికిన హీరోలతో సర్దుకుపోవడం తప్పేం కాదుగా.