శశిథరూర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీనో.. బీజేపీ లీడరో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ కేరళలో పర్యటించినప్పుడు ఆయనో కలిసి శశిథరూర్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీన్ని చూసి కొంత మందికి నిద్రపట్టదని కాంగ్రెస్ నేతలపై మోదీ సెటైర్లు కూడా వేశారు. తాజాగా శశిథరూర్ కు మరో కీలక బాధ్యత అప్పచెప్పింది కేంద్రం. ఆయనను కాంగ్రెస్ ఎంపీగా చెబుతున్నారు కానీ.. కాంగ్రెస్ అధికారిక నామినీ కాదు.
అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేసే ఉద్దేశంతో ఇటీవల జరిగిన పరిణామాలు, హెహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్ పై భారత్ దాడుల గురించి వివరించేందుకు బృందాలను కేంద్రం నియమించింది. విపక్ష పార్టీలకు చెందిన వారికీ అవకాశాలు కల్పించింది. కాంగ్రెస్ నుంచి శశిథరూర్ ఓ బృందానికి నాయకత్వం వహిస్తారు. ఈ పేరు కాంగ్రెస్ ను షాక్ కు గురి చేసింది. ఎందుకంటే కేంద్రం నాలుగు పేర్లను పంపమని అడిగింది.. కాంగ్రెస్ నాలుగు పేర్లను పంపింది కానీ అందులో శశిథరూర్ పేరు లేదు.
కానీ కేంద్రం శశిధరూర్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేస్తోంది. నిజానికి శశిథరూర్ అంతర్జాతీయ వ్యవహారాల్లో నిపుణుడు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవి కోసం పోటీ పడి స్వల్ప తేడాతో ఓడిపోయాడు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ఉన్న పరిజ్ఞానాన్ని , అనుభవాన్ని కేంద్రం వాడుకోవచ్చు. మంచి చాయిస్ కూడా . కానీ ఇటీవల శశిథరూర్ కాంగ్రెస్ తో దూరంగా ఉంటున్నారు. అందుకే ఆ పార్టీ సిఫారసు చేయలేదు. కానీ బీజేపీ ఎంపిక చేసుకుంది.