బీజేపీ అవకాశం ఇస్తే ఆ పార్టీతో కలిసి నడుస్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన తాను నడుస్తానని చెప్పలేదు.. వైసీపీనే నడుస్తుందని చెబుతున్నారు. బీజేపీ ఇప్పుడు అధికార కూటమిలో ఉంది. ఏ మాత్రం సిగ్గు, లజ్జ ఉన్న పార్టీ నేతలు అలాంటి ప్రకటనలు చేయరు. అధికారంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీపై విరుచుకుపడి ప్రజల అభిమానం పొందాలనుకుంటారు. కానీ బీజేపీ ప్రాపకం కోసం దేనికైనా సిద్ధమని ప్రకటనలు చేయరు. కానీ ఈ విషయంలో వైసీపీకి ఎలాంటి విలువలు ఉండవు. వారికి కావాల్సింది ఒక్కటే.. తమ అవినీతి కేసుల నుంచి రక్షణ.
ఎంతో కొంత వ్యక్తిత్వం కాపాడుకోవాలిగా!
రాజకీయాలకు.. నైతిక విలువలకు లింక్ ఉండదు. అంత మాత్రాన దిగంబరంగా తిరిగేస్తామని అనుకోవడానికి లేదు. ఎక్కడో చోట..తమకంటూ ఓ విధానం.. వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలి. లేకపోతే కామెడీ స్టాక్ అయిపోతారు. విధానాల పరంగా అసహ్యంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు వైసీపీని అలా చూడాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు బీజేపీతో కలిసి నడుస్తామని ప్రకటన చేయాల్సిన అవసరం ఏముంది?. ఆలా నడిస్తే ఆ పార్టీ పని అయిపోతుంది. ఏ మాత్రం చాన్స్ ఉన్నా గతంలోనే పొత్తులు పెట్టుకునేవారు.
బీజేపీకి పూర్తి సహకారం ఇచ్చారట!
కానీ.. నేరుగా పొత్తులు పెట్టుకోలేమని కానీ రాజకీయ వ్యభిచారం చేస్తామని మాత్రం ఆఫర్ ఇచ్చారు. చేశారు కూడా. ఐదేళ్ల పాటు అడ్డగోలుగా సమర్థించామని.. బీజేపీ ఏ బిల్లు పెట్టినా సమర్థించామని నల్లపురెడ్డి చెప్పు్కొచ్చారు. ఆయన చెప్పడం కాదు.. అది నిజం కూడా. ఇంకాబీజేపీ అధినాయకత్వాన్ని గిలిగింతలు పెట్టడానికి అవసరమైనప్పుడల్లా రాహుల్ గాంధీపై రాళ్లేశారు కూడా. ఏ మాత్రం వ్యక్తిత్వం లేని రాజకీయంతో వైసీపీ ఇప్పటికే పరువు పోగొట్టుకుంది. ఇప్పుడు మరింత దిగజారుతోంది.
కేసులు లేకపోతే మోదీని, బీజేపీని ఎంతలా తిట్టించేవారో చెప్పాల్సిన పని లేదు !
జగన్ రెడ్డి చేసిన అవినీతి వ్యవహారాలపై కేసులు వెంటాకపోతే జగన్ రెడ్డి ఎప్పుడో మోదీని, బీజేపీని తన మూకతో ఇష్టం వచ్చినట్లుగా తిట్టించి ఉండేవారు. తిట్టిస్తూ ఉండేవారు. ఎందుకంటే.. ఆయన ఓటు బ్యాంక్ ముస్లింలు, క్రిస్టియన్లు. మోదీని ఎంత వ్యతిరేకిస్తే జగన్ కు అంత బలం. బీజేపీతో రాసుకు పూసుకుని తిరగడం వల్ల గత ఎన్నికల్లో కొంత శాతం ముస్లిం ఓట్లు , దళితుల ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లాయి. అయినా ఇప్పుడు తాము బయట ఉండటం ముఖ్యమని మరోసారి రాజకీయ వ్యభిచారానికి సిద్ధమని ప్రకటనలు చేస్తున్నారు.