భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేస్తున్న వారిని ఇప్పుడు నిఘా సంస్థలు గురి పెట్టి మరీ పట్టుకుంటున్నాయి. హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ తో పాటు ఆరుగురిని అరెస్టు చేశారు. అక్కడ్నుంచి వరుసగా అరెస్టులు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో సంగారెడ్డిజిల్లాలో పని చేస్తున్న ఓ తాపీమేస్త్రిని కూడా అరెస్టు చేశారు. వీళ్లంతా పాకిస్తాన్ కు అత్యంత కీలమైన సమాచారాన్ని చేరవేరస్తున్నారు. అందు కోసం కోసం టెక్నాలజీని అందరూ వినియోగించుకున్నట్లుగానే వినియోగిస్తూ..అనుమానం రాకుండా పని పూర్తి చేస్తున్నారు.
జ్యోతి మల్హోత్రా విస్తృత పర్యటనలు
ట్రావెల్ వ్లాగర్ అయిన జ్యోతి మల్హోత్రా పెహల్గాం దాడి జరగడానికి ముందు అక్కడ వీడియోలు చేశారు. ఆమె నిర్వాకాలు వెలుగులోకి వస్తూంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. చివరికి సికింద్రాబాద్ కూడా ఆమె వచ్చారు. కేరళ, ఒరిస్సాల్లోనూ కీలక వీడియోలు చేశారు. ఇవన్నీ టూరిజం అంటే ఇష్టం ఉండేవారికి నచ్చే వీడియోలు అనుకుంటారు.కానీ.. అవన్నీ పాకిస్తాన్ లోని తనకు పని అప్పచెప్పిన ఏజెంట్లకు సమాచారం ఇచ్చేందుకు చేసిన వీడియోలు. ఆమె వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
చాలా మంది జ్యోతి మల్హోత్రాలు !
ఉద్దేశపూర్వకంగా పాక్ కోసం పని చేసిన కొందరు.. డబ్బుల కోసం కక్కుర్తి పడిన కొందరు.. తాము చేస్తున్నది స్పైయింగ్ కాదు అని తెలియక మరికొందరు .., దేశానికి ద్రోహం చేశారు.కొంత మంది భారత సిమ్‌లతో పాకిస్తాన్ లో వాట్సాప్ ఖాతాలను క్రియేట్ చేసుకున్నారు. భారత్ కు చెందిన సున్నిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి పాకిస్తాన్ కు చెందిన వారు అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా వచ్చాక వారి పని సులువు అయింది. ఫలితంగా ఎంతో మంది.. వారి ట్రాప్ లో పడ్డారు.
ఇప్పుడు పూర్తి స్థాయిలో నిఘా !
ఇప్పుడు పాకిస్తాన్ వైపు వెళ్తున్న ప్రతి సిగ్నల్ ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరేవేసేవారిని కనిపెడుతున్నారు. అయితే వీరిలో చాలా మందికి తాము స్పైయింగ్ చేస్తున్నామని కూడా తెలియదు. డబ్బుల కోసమో.. మరో విధంగానో ట్రాప్ లో చిక్కుతున్నారు. కొంత మంది ఉద్దేశపూర్వకంగానే ఈ పనులు చేస్తున్నారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా.. అది దేశద్రోహమే అవుతుంది.