ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో బాధితులైన లిక్కర్ కంపెనీలన్నీ భయపడకుండా బయటకువచ్చి తాము ఇచ్చిన లాంచాలు, తీసుకున్న వారి గుట్టు మొత్తాన్ని బయట పెడుతున్నాయి. తాజాగా ఆర్థోస్ అనే కంపెనీ యజమానాలు తమ కణతకు తుపాకి గురి పెట్టి మరీ ఎలా దోపిడీ చేశారో వివరించారు. ఈ పని చేసింది అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. ఖజురహో అనే బ్రాండ్ మద్యాన్ని వీరికి జగన్ అప్పచెప్పారు. వారి వద్ద నుంచి కమిషన్లు తీసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వారు రెచ్చిపోయారు.
లిక్కర్ కంపెనీల్ని చాలా వరకూ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిని గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని కంపెనీల్లో కేసు బాటిల్స్ కు ఇంత అని చెప్పి కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్ ను నగదు రూపంలోనే కాకుండా.. బంగారం సహా ఇతర మార్గాల్లో వసూలు చేసుకున్నారు. ఇందు కోసం తప్పుడు కంపెనీలు సృష్టించారు. ఖర్చు లేని చోట ఖర్చు చూపించారు. లాజిస్టిక్స్ అని.. అవనీ..ఇవనీ ఇతర ఖర్చులు చూపించారు. ఆ సొమ్ము అంతా లిక్కర్ స్కామర్ల చేతుల్లోకి పోయింది.
చాలా లిక్కర్ కంపెనీలు నేరుగా ఫిర్యాదు చేయకపోయినా తాము ఎలా ముడుపులు చెల్లించామో వివరాలు ఇచ్చారు. తమపై కేసులు రాకుండా.. తమ వ్యాపారాలు దెబ్బతినకుండా చూసుకుటూ వారు.. ఐదు సంవత్సరాల పాటు తమ రక్తాన్ని పీల్చిన వారిని బుక్ చేసేందుకు ఆధారాలు ఇస్తున్నారు. దాదాపుగా అన్ని కంపెనీలకు చెందిన వారు..తమను ఎలా బెదిరించి లిక్కర్ వ్యాపారాన్ని, కమిషన్లను కొట్టేశారో వివరించారు. ఇందులో గ్యాంగ్ మొత్తం ఉంది. అన్ని వివరాలు సీఐడీ సిట్ రెడీ చేసింది.