వైజాగ్లో డిప్యూటీ మేయర్ పదవిని జనసేన పార్టీకి కేటాయించడానికి టీడీపీ కార్పొరేటర్లు అంగీకరించలేదు. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఉపఎన్నికకు మెజార్టీ కార్పొరేటర్లు హాజరు కాలేదు . దాంతో కోరం లేక ఎన్నికను వాయిదా వేశారు. విశాఖ కార్పొరేషన్ గతంలో వైసీపీ చేతుల్లోఉండేది. కార్పొరేటర్లు ఫిరాయించడంతో కూటమి చేతుల్లోకి వచ్చింది. మేయర్ గా టీడీపీ కార్పొరేటర్ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ స్థానం కోసం కూడా టీడీపీలో గట్టిపోటీ ఉంది. అయితే చర్చల తర్వాత జనసేన పార్టీకి కేటాయించాలని నిర్ణయించారు. దీంతో కినుక వహించిన కార్పొరేటర్లు సమావేశానికి రాలేదు.
కోరానికి అవసరమైన సంఖ్య 56 కాగా.. అంత కంటే తక్కువ మంది కార్పొరేటర్లు వచ్చారు. వైసీపీ వాళ్లు అసలు రాలేదు. సమావేశానికి హాజరు కాని కార్పొరేటర్లపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కార్పొరేటర్లను హెచ్చరించారు.
తదుపరి జరిగే సమావశానికి హాజరు కాకపోతే ఇక పార్టీలో సభ్యులన్న సంగతిని మార్చిపోవచ్చని హెచ్చరికలు పంపించారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి డిప్యూటీ మేయర్ ఇవ్వాలనుకున్నది పార్టీ నిర్ణయం అని..ధిక్కరించలేరని స్పష్టం చేస్తున్నారు. కార్పొరేటర్లు దారికి వస్తారా రారా.. అన్నది తర్వాత సమావేసంలో తేలిపోనుంది.