War2 Movie Teaser
ఈరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘వార్ 2’ టీజర్ విడుదల చేశారు. దేవర తరవాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా. పైగా తొలి స్ట్రయిట్ బాలీవుడ్ ప్రాజెక్ట్. అన్నింటికంటే ముఖ్యంగా హృతిక్ రోషన్తో చేస్తున్న మల్టీస్టారర్. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ఇందులో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడు? తన పాత్రేమిటి? ఈ విషయాల్లో చిత్రబృందం ఇప్పటి వరకూ గోప్యత పాటించింది. ఇప్పుడు టీజర్ తో ఆ సస్పెన్స్ కు తెర దించినట్టైంది. కబీర్ (హృతిక్ రోషన్) ఇండియాలోనే ది బెస్ట్ రా ఏజెంట్. అనుకోని పరిస్థితుల్లో తానే ఓ గ్యాంగ్ స్టర్ గా మారాల్సివస్తుంది. తనని పట్టుకోవడానికి వచ్చే ‘రా’ ఆఫీసరే..ఎన్టీఆర్. అంటే ఈ సినిమా మొత్తం హృతిక్ – ఎన్టీఆర్ మధ్య వార్ అనుకోవొచ్చు.
టీజర్లోనూ అదే చూపించారు. హృతిక్ ని పట్టుకోవడమే ఎన్టీఆర్ టార్గెట్. మధ్యలో ఛేజ్లూ, సవాళ్లూ ప్రతిసవాళ్లూ, యాక్షన్ షాట్స్ తో నింపేశారు. ఎన్టీఆర్ లుక్.. కొత్తగా ఉంది. ఈ టీజర్లో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు. అదుర్స్ టైమ్ లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలానే అనిపిస్తున్నాడు. హిందీలో తానే డబ్బింగ్ చెప్పుకొన్నాడు. తన డబ్బింగ్ సాలీడ్ గా ఉంది. చివర్లో హృతిక్ – ఎన్టీఆర్ మధ్య భారీ పోరు. ఆ పోరులో ఎవరు గెలుస్తారు? అనేది తెరపై చూడాలి. యశ్ రాజ్ ఫిల్స్మ్ అంటేనే భారీదనానికి మారు పేరు. అది ‘వార్ 2’లో మరోసారి కనిపించింది.యాక్షన్ ఎపిసోడ్స్ బాగా తీర్చిదిద్దారు. కాకపోతే కొన్ని చోట్ల సీజీ వర్క్ తేలిపోయినట్టు అనిపించింది. ముఖ్యంగా ట్రైన్ పై ఎన్టీఆర్ పరిగెట్టే షాట్ లో సీజీ ఇంకాస్త బాగా చేయాల్సింది. కైరా అడ్వానీ ఒకే ఒక్క షాట్ లో అలా మెరిసి, ఇలా మాయమైపోయింది. టీజర్లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరే హైలెట్ అయ్యారు. ఆగస్టు 14న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. జూలై చివరి వారం నుంచి ఎన్టీఆర్ ‘వార్ 2’ ప్రమోషన్లలో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది.