కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పదవి కాలం రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ తో పాటు నీటిపారుదల , ఆర్థిక మంత్రులుగా పని చేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు నోటీసులు జారీ చేసింది. జూన్ ఐదో తేదీన తమ ఎదుటకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
నిజానికి ఈ జస్టిస్ పీసీ ఘోష్ ఈ ముగ్గురిని ప్రశ్నించాలా వద్దా అన్నదానిపై తర్జన భర్జన పడ్డారు. రాజకీయ కారణాలతోనే విచారణ జరుపుతున్నారన్న వివాదాలు రాకుండా ఉండేందుకు అయినా వారిని ప్రశ్నించకుండా ప్రాథమిక నివేదిక ఇవ్వాలనుకున్నట్లుగా ప్రచారం జరిగింది.ఈ మేరకు నివేదిక కూడా రెడీ చేశారు. కానీ అసలైన వ్యక్తుల్ని ముఖ్యంగా.. క్రాస్ ఎగ్జామినేషన్ లో అందరూ అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పినందున కేసీఆర్ ను ప్రశ్నించకపోతే ఆ నివేదికకు అర్థం ఉండదన్న అభిప్రాయం రావడంతో జస్టిస్ పీసీ ఘోష్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండు నెలలు ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఆ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు.
ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరవుతారా.. లేకపోతే కోర్టుకు వెళ్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కేసీఆర్ హాజరు కాకపోవచ్చని న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఈటల రాజేందర్.. చాలా కాలమే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.