హీరోగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్ కెరియర్లని సెట్ చేసేసిన సినిమా ఆర్య. లవ్ స్టోరీల్లో అదో ట్రెండ్. పాటలు, క్యారెక్టరైజేషన్.. ఇలా ఏ కోణంలో చూసుకొన్నా ఇప్పటికీ కొత్తగా అనిపించే సినిమా. ఆ తరవాత ఇదే కాంబోలో `ఆర్య 2` వచ్చింది. కానీ అది ఫెయిల్ అయ్యింది. ఆమధ్య ‘ఆర్య’ విడుదలై ఇరవై ఏళ్లయిన సందర్భంగా టీమ్ అంతా కలుసుకొని సంబరాలు కూడా చేసుకొన్నారు. ఇప్పుడు ‘ఆర్య 3’ కోసం కసరత్తులు మొదలెట్టినట్టు టాక్ నడుస్తోంది. తాజాగా దిల్ రాజు బ్యానర్లో ‘ఆర్య 3’ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించేశారు.
‘ఆర్య 3’ చేస్తే గీస్తే సుకమార్ – బన్నీలే చేయాలి. వాళ్లే ఆ మ్యాజిక్ సృష్టించగలరు. కాకపోతే వీళ్లకు అంత టైమ్ ఉందా? అనేది క్వశ్చన్ మార్క్. ‘ఆర్య 3’ చేయాలంటే ముందు ‘పుష్ప 3’ ఫినిష్ చేయాలి. ఎందుకంటే దేశం మొత్తం ఇప్పుడు ‘పుష్ప 3’ మూడ్ లో ఉంది. ఈ సినిమా ఎప్పుడొస్తుందా? అని చూస్తున్నారు. బన్నీ, సుక్కు కూడా ‘పుష్ప 3’తోనే మళ్లీ కలుస్తారు. ఈలోగా అటు బన్నీ, ఇటు సుకుమార్ కొన్ని సినిమాలు పూర్తి చేయాలి. కనీసం 3 ఏళ్లయినా సమయం పడుతుంది. ఆ తరవాతే ‘ఆర్య 3’.
సుకుమార్ దగ్గర కథ మాత్రమే తీసుకొని.. మరో హీరో, మరో దర్శకుడు కలిసి ఈ సినిమాని పూర్తి చేస్తే? – ఈ ఆలోచన కూడా దిల్ రాజుకు ఉంది. అందుకే ముందుగా ఆయన ‘ఆర్య 3’ టైటిల్ రిజిస్టర్ చేసేశారు. తరవాత పరిస్థితిని బట్టి చూద్దామన్నది ఆయన ప్లాన్. ‘పుష్ప 3’ కంటే ముందు.. ఓ లవ్ స్టోరీ చేద్దామన్న ఆలోచన అటు బన్నీకి గానీ, ఇటు సుకుమార్‌కి గానీ వస్తే అప్పుడు ‘ఆర్య 3’ మొదలవ్వొచ్చు. ఏమో ఎవరు ఏం చెప్పగలరు?