ఏపీ లిక్కర్ స్కామ్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంక అంతా కదిలినట్లుగా ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న విషయాలు నోరెళ్ళబెట్టేలా చేస్తున్నాయి. ఇప్పటికే స్కామ్ నగదుతో జగన్ సన్నిహితులు 1000కోట్లతో బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ నడిపించారనే విషయం బయటకు రాగా.. ఊహించని విధంగా బంగారం కూడా భారీ ఎత్తున కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఫేక్ మద్యం కంపెనీలు సృష్టించి ఆ కంపెనీ అధిపతులు భారీగా బంగారం కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదట 400కిలోల బంగారం కొనుగోలు చేశారనుకున్నా.. అది వెయ్యి కిలోల వరకు ఉండొచ్చునని ప్రచారం జరుగుతోంది. బంగారం వ్యాపారం అధికంగా జరిగే ముంబై మార్కెట్ , తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి 200కోట్ల విలువైన బంగారం కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా మిగతాది ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు.
బంగారం కొనుగోలు చేసిన తర్వాత మద్యం కంపెనీల అధినేతలు … రాజ్ కేసిరెడ్డి బృందానికి పంపేవారని తెలుస్తోంది. ఆ బంగారం విదేశాలకు పంపి , నగదుగా మార్చి దాన్ని రియల్ ఎస్టేట్ , సినిమా రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఎవరెవరు బంగారం కొనుగోలు చేసి, రాజ్ కేసిరెడ్డి బృందానికి పంపారు? ఆ బంగారాన్ని విదేశాలకు ఎలా పంపారు? ఇందుకోసం రాజ్ కేసిరెడ్డికి ఎవరెవరు తోడ్పాటు అందించారు?అనే విషయాలపై సిట్ ప్రస్తుతం ఫోకస్ పెట్టింది.మరోవైపు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తున్న ఈడీ.. నిందితుల విచారణకు అనుమతి కోరింది. అనుమతి రాగానే ఈ కేసులో నగదు లావాదేవీలు, బంగారం కొనుగోలు వంటి వాటిపై ఫుల్ ఫోకస్ పెట్టబోతోంది.