తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఎండలు మండిపోగా బుధవారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృత్తమై ఉండటంతో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనుకుని దక్షిణ కోస్తా , రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.
బుధవారం నుంచి మూడు రోజులపాటు ఆకాశం పూర్తిగా మేఘావృత్తమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చల్లని కబురు అందించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 50కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాలలో ఉదయం నుంచి అక్కడక్కడ వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ వర్షం కురుస్తోంది. విశాఖలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. కుండపోత వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. రాయలసీమ ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.