రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్ లో ప్రభావవంతమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇటీవల ఉపఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీ అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. ఊహించనంతగా ఓట్లు సాధించలేకపోయినా… ప్రశాంత్ కిషోర్ ను ప్రజలు గుర్తిస్తున్నారన్నదానికి ఆ ఎన్నికల ఫలితాలు ఓ సంకేతంగా మారాయి. దాంతో ఆయన మరింత దూకుడుగా తన వ్యూహాలు అమలు చేస్తున్నారు.
సీఎం పదవి కోసం కాదు.. బీహార్ అభివృద్ధి కోసం !
ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ అనే సంస్థను పెట్టి ఆ తర్వాత రాజకీయ పార్టీగా మార్చారు. కొన్ని రోజులు పాదయాత్ర చేశారు కానీ.. మధ్యలో ఆపేశారు. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాలు చేస్తున్నానని వస్తున్న విమర్శలపై ఆయన రాజకీయ పద్దతిలోనే స్పందిస్తున్నారు. తాను పది మంది ముఖ్యమంత్రులు అయ్యేందుకు సహకరించానని .. పదవి కోసం తాను రాజ్‌ల నుకీయం చేయడం లేదన్నారు. బీహార్ కోసమే తాను రాజకీయం చేస్తున్నానని చెప్పుకొస్తున్నారు.
హర్యానా, పంజాబ్ ల నుంచి బీహార్‌కు వలస వచ్చేలా అభివృద్ధి !
బీహార్ చాలా వెనుకబడిపోయిందని అందరికీ తెలిసిన విషయమే. అక్కడి యువత పనుల కోసం.. ఉపాధికోసం పంజాబ్, హర్యనాతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు.. ఇంకా చెప్పాలంటే దక్షిణాదికీ వెళ్తూంటారు. వీటన్నింటినీ ఆగిపోయేలా చేసి.. పంజాబ్, హర్యానాలా నుంచే బీహార్ కు వచ్చేలా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ మోడల్ ఎలాంటిదో కానీ ఆయన మాత్రం.. అందరూ బాగుపడుతున్నారు.. మనం మాత్రం బాగుపడవద్దా అని అనుకునే బీహార్ యువతలో ఆశలు రేకెత్తించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికీ ప్రధాన పోటీదారుగా మారలేకపోయిన ప్రశాంత్ కిషోర్
ప్రస్తుతం బీహార్ లో ఆర్జేడీతో కూటమి, బీజేపీ, జేడీయూ కూటమి కలిసి పోటీ చేస్తున్నాయి. మూడో పక్షంగా ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. అయితే ప్రజలంతా ఆయన వైపు తిరిగేలా చేసుకోవడంలో విఫలమయ్యారు. అభివృద్ధి కాంక్షించేవారిని ఆయన ఆకట్టుకున్నారు. కానీ బీహార్ రాజకీయం అంతా కుల సమీకరణాల మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో ఆయన వెనుకబడి ఉన్నారు. కుల, మతాలకు అతీతంగా.. బీహార్ అభివృద్ధి అనే అంశంతో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.