సందీప్ రెడ్డి చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకేం కావాలో తెలుసు. ఎవరి నుంచి ఏం రాబట్టుకోవాలో తెలుసు. అన్నింటికంటే ముఖ్యంగా డేర్ అండ్ డాషింగ్. ఏదైనా సరే.. మొహం మీదే చెప్పేస్తాడు. తన థాట్ ప్రోసెస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రభాస్ లాంటి హీరో సినిమా ఒప్పుకొంటే ‘ఇదే మహాప్రసాదం’ అనుకొనే తత్వం కాదు. ‘నా స్కూల్ ఇది.. నేను ఇలానే సినిమాలు తీస్తా. అందుకు తగ్గట్టుగా నువ్వు ఉండాలి’ అంటూ కండీషన్లు పెట్టే రకం. అలాంటిది హీరోయిన్లు తోక జాడిస్తే ఊరుకొంటాడా?
ప్రభాస్ తో సందీప్ రెడ్డి ‘స్పిరిట్’ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా దీపికా పదుకొణేని అనుకొన్నారు. ప్రభాస్ – దీపిక జోడీ అంటే కచ్చితంగా టాప్ లెవల్ లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు `స్పిరిట్`లో దీపిక స్థానం ప్రమాదంలో పడింది. ఈ సినిమా నుంచి దీపికను తప్పించాలని సందీప్ రెడ్డి డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. ఎందుకంటే దీపికను భరించడం కష్టం అనే సంగతి టీమ్ కి ఈ కొద్ది రోజుల్లోనే బాగా అర్థం అవుతోంది.
అందరికీ కండీషన్లు పెట్టే సందీప్ దగ్గరే దీపిక కండీషన్లు చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. షూటింగ్ టైమింగ్స్, పారితోషికం, లాభాల్లో వాటా..అంటూ దీపిక రోజుకో డిమాండ్ ముందు పెడుతోందట. కాల్షీట్ అంటే సాధారణంగా 8 గంటలు ఉంటుంది. కానీ దీపిక మాత్రం ఆరు గంటల్లోనే షూటింగ్ ముగించాలని, అదనంగా పని చేయాలంటే మరింత పారితోషికం కావాలని షరతులు విధిస్తోందని, లాభాల్లో కూడా తనకు వాటా దక్కాలంటోందని, పైగా తన టీమ్ శాలరీలు కూడా నిర్మాతే భరించాలని చెబుతోందని.. ఇవన్నీ భరించలేక దీపిక స్థానంలో మరో కథానాయికని తీసుకురావడానికి సందీప్ ప్రయత్నాలు మొదలెట్టాడని సమాచారం.
ఎప్పుడైతే దీపిక ఈ సినిమా నుంచి తప్పుకోబోతోందని వార్తలు మొదలయ్యాయో, అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ‘దీపిక స్థానంలో మృణాల్ ని తీసుకో డార్లింగ్’ అంటూ సలహాలు ఇవ్వడం మొదలెట్టారు. ప్రభాస్ – మృణాల్ ల జోడీ చూడ్డానికి బాగుంటుంది. `ఫౌజీ`లో ఈ జోడీ కనిపిస్తుందని అంతా ఆశ పడ్డారు. కానీ కుదర్లేదు. దీపిక తప్పుకొంది కాబట్టి.. ఆ స్థానంలో మృణాల్ వస్తుందేమో చూడాలి.