ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అవుతూ రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరుతూ, అమరావతి నిర్మాణం గురించి వివరిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను రిలీజ్ చేయాలని కోరారు. అనంతరం కేంద్రహోంమంత్రి అమిత్ షాతో సమావేశమై.. నూతన క్రిమినల్ చట్టాలపై సమాలోచనలు జరిపారు.
అమిత్ షాతో సమావేశం ముగిసిన వెంటనే రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు చంద్రబాబు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులను వివరించారు. బెల్ డిఫెన్స్ కాంప్లెక్స్ . ఏరో స్పేస్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
కీలకమైన పోలవరం – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో చర్చించారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి వివరించిన చంద్రబాబు…డీపీఆర్ ను త్వరలోనే సమర్పిస్తామని చెప్పారు. పనులను చేపట్టేందుకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని అభ్యర్థించారు.
ఇటు ప్రహ్లాద్ జోషీతో కూడా సమావేశం అయ్యారు చంద్రబాబు. పీఎం సూర్యఘర్ యోజన కింద రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు. రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ కేటాయింపు ప్రతిపాదనలను అందించి… ఎస్సీ, ఎస్టీ గృహాలకు 20లక్షల సోలార్ ప్యానెల్స్ , బీసీ గృహ సముదాయాలకు 2కిలో వాట్ల వరకు అమర్చుకునేలా 10వేల సబ్సిడీ అందించాలన్నారు.
ఏపీని శాస్త్ర సాంకేతిక రంగంలో డెవలప్ చేయాలని పట్టుదలతో ఉన్న చంద్రబాబు…శాటిలైట్ ఉపగ్రహాల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు మద్దతు ఇవ్వాలని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ ను కోరారు. ఏపీలో రెండు స్పేస్ సిటీలకు సహకారం అందించాలన్నారు. ఒకటి శ్రీహరి కోట సమీపంలో, మరొకట లేపాక్షి వద్ద ఏర్పాటు చేయనున్నారు.