రాజకీయాలు అన్న తర్వాత విలువలు, నైతికత, మట్టి , మషాణం ఏమీ ఉండవని పూర్తి దిగంబరంగా తిరిగేస్తూంటామని సిగ్గు, ఎగ్గూ పెట్టుకోబోమని వైసీపీ నేతలు రుజువు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇవన్నీ ఉండవని వారు వాదించవచ్చు కానీ దేవతా వస్త్రాల్లాగా.. తమకు కొన్ని విలువలు, విధానాలు ఉన్నాయని ప్రజలను నమ్మించాల్సి ఉంటుంది. అలాగేమీ ఉండదు.. రాజకీయాలు అంటే ప్రజల్ని మోసం చేయడమే.. అదే మేము చెబుతున్నాం.. చేస్తాం అని అంటే ఎలా కుదురుతుంది. అమరావతి విషయంలో వైసీపీ , జగన్ ఇదే చేస్తున్నారు.
రాజధానిపై ఇంగిత జ్ఞానం లేని జగన్ మాటలు
రాష్ట్రంపై, రాష్ట్ర భవిష్యత్ పై , యువత భవిష్యత్ పై ఎలాంటి అంచనాలు లేని ఓ రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతారో అలాగే జగన్ మాటలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానిపై ఆయన మాట్లాడిన మాటల వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి. 30వేలకుపైగా ఎకరాల భూమి ఉండాలని.. అన్నారు. ఓడిపోయాక అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపారు. కానీ ఆయన కు ఇష్టం లేదు. ప్రజల్ని మోసం చేయడానికే ఆ మాటలు చెప్పారు. అప్పట్నుంచి కుట్రల మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అదే చేశారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. ఓడిపోయాక అదే చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ మధ్య ఐదు వందల కోట్లతో కట్టేసుకోవచ్చట. మరి ఆరు వందల కోట్లతో రుషికొండ ప్యాలెస్ మాత్రమే ఎందుకు కట్టగలిగారు?
జగన్ రెడ్డి చేసేది రాజకీయం కాదు ద్రోహం !
రాష్ట్రానికి రాజధాని అనేది లైఫ్ లైన్. దాన్ని పీకేసేలా చేసేది రాజకీయం కాదు. ఐదు ఏళ్ల పాటు అదే చేశారు. ఇప్పుడు ఓడిపోయినా బుద్ది మార్చుకోలేదు. రాజధాని అనేది ఏ ఒక్కరిది కాదు. అక్కడ భూములిచ్చిన వారిది మాత్రమే కాదు. వారు భూములిచ్చారు కాబట్టి వారికి అక్కడ కొంత ఆస్తి ఉంటుందేమో. అంత మాత్రాన అది వారిదే అనడం.. అమాయకత్వం. అమరావతి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరిది. జగన్ రెడ్డిది కూడా . అందుకే ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నారు. కానీ ఈ కుట్రలు చేయడం మాత్రం సామాన్యమైన విషయం కాదు. ఓ ఆలోచన లేకుండా.. ఓ పద్దతి లేకుండా తప్పుడు ప్రచారాలతో రాష్ట్రానికి ద్రోహం చేయాలనుకోవడం ఆయనకే సొంతం. అయన చేస్తోంది రాజకీయం కాదు…ద్రోహం.
ఇంకెంత దిగజారుతారు ?
ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకోవడానికేనన్నట్లుగా ఐదు సంవత్సరాల పాటు వంది మాగధులతో దోచుకున్న జగన్ రెడ్డికి అధికారం పోయాక పిచ్చిపట్టినట్లుగా అయింది. అందరూ వదిలేసిపోతూంటే.. ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను కీలుబొమ్మలాగా చేసి.. సజ్జల వంటి వారు ఆడుకుంటున్నారు. కనీసం కాస్త విలువలు ఉన్న రాజకీయ నాయకుడిగా మేకోవర్ ఇవ్వకపోతే.. భవిష్యత్ ఇంకా ఘోరంగా ఉంటుంది.