గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు త్వరలో కొత్త ఇంచార్జ్లను ప్రకటించనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పుడల్లా రాజకీయాలను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. నియోజకవర్గాలకు వచ్చే అవకాశం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రెండు నియోజకవర్గాలను గాలికి వదిలేయకుండా.. కొత్త ఇంచార్జులను నియమించాలనే ఆలోచనలో ఉన్నారు.
గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే దుట్టా కుటుంబానికి మాటిచ్చారు. దుట్టా రామచంద్రరావు అల్లుడు జగన్ రెడ్డికి బంధువులని చెబుతారు. ఆయన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు కాకుండా.. దుట్టా కుమార్తెకే అక్కడ ఇంచార్జ్ పదవి ఇస్తే బీసీలకు ఇచ్చినట్లుగా ఉంటుందని దుట్టా కుమార్తె పేరును జగన్ ఫైనల్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గుడివాడ నియోజకవర్గంలో అయితే ప్రస్తుతానికి కొడాలి నాని యాక్టివ్ గా లేరు. అనారోగ్యం ఇతర కారణాలతో నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేదు.
అక్కడ ఇంచార్జ్ గా ఎవర్ని పెట్టాలన్నదానిపై జగన్ తర్జన భర్జన పడుతున్నారు. ఈ అంశంపై కొడాలి నాని అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు టిక్కెట్ కొడాలి నానికే ఇచ్చినా ఇప్పుడు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఓ ఇంచార్జ్ ను పెడతామని.. ఆ పేరు కూడా మీరే సూచించాలని కొడాలి నానికి సందేశం పంపించినట్లుగా చెబుతున్నారు. కానీ నాని వైపు నుంచి ఇంకా సమాధానం వెళ్లనట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలకు ఏడాది ముందు వరకూ వీరిద్దరూ .. మళ్లీ జనాల్లోకి వచ్చే చాన్సుల్లేవు. అప్పుడు కూడా పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. అందుకే జగన్ ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.