పాతికేళ్లుగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే అని కేటీఆర్ ఇటీవల తరచూ చెబుతున్నారు. తమ పార్టీ గొప్పదనాన్ని .. సుదీర్ఘంగా ఉందని, ఉంటుందని చెప్పుకోవడానికి కేటీఆర్ తెలుగుదేశం పార్టీని ఉదాహరణకు చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికి నాలుగు దశాబ్దాలు దాటిపోయింది. ఇప్పటికి ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. దీనికి కారణం పార్టీ సిద్ధాంతాలు … బలమైన యువ నాయకత్వం ఎప్పటికప్పుడు రెడీ అవుతూండటమే. ఇప్పుడు మరో తరంలోకి పార్టీ మారాల్సిన సమయం వచ్చిందన్న అభిప్రాయం క్యాడర్ లో వినిపిస్తోంది.
ప్రజల్లో బలమైన పునాదులు ఉన్న పార్టీ టీడీపీ
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ ప్రజాకర్షక శక్తి మీదనే ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే టీడీపీ ఉండదు అని అప్పట్లో అనుకున్నారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ కూడా టీడీపీ నేను స్థాపించాను.. నాతోనే అంతర్ధానం అయిపోతుందని వ్యాఖ్యానించారన్న ప్రచారమూ జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజల పార్టీ అయింది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన సూపర్ విజన్ చేస్తూ కొత్త తరానికి బాధ్యతలు అందించాల్సిన సమయం వచ్చింది.
టీడీపీకి యువనాయకత్వమే బలం
తెలుగుదేశం పార్టీకి బలం యువ నాయకత్వం. వారసత్వం మాత్రమే కాదు ప్రతిభ కూడా ఉందని నిరూపించుకున్న నేతలు టీడీపీలో ఉన్నారు. నారా లోకేష్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆయన మొదటి నుంచి పార్టీకి అంతర్గతంగా పని చేస్తూ వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పి సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేశారు. కేసులు లేవు.. రౌడీ పనులు చేయరు అని.. ఆయన సమర్థమైన రాజకీయ నేత కాదన్నట్లుగా ముద్ర వేశారు. కానీ అవేమీ లేకపోయినా సమర్థమైన లీడర్నేనని.. పార్టీని నడిపించగలనని నిరూపించారు. పాదయాత్ర చేశారు. పార్టీ వ్యవహారాల్ని సమన్వయం చేస్తున్నారు. ఒక్క నారా లోకేష్ మాత్రమే కాదు..సడెన్ గా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు దగ్గర నుంచి పరిటాల శ్రీరామ్ వరకూ ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ టీడీపీకి బలమైన యువ నాయకత్వం ఉంది. వారందరికీ అదనపు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.
లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ – యువతకు మరింత యాక్టివ్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును నారా లోకేష్ కు ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా ఉంది. నారా లోకేష్ అటు ఢిల్లీ వ్యవహారాలతో పాటు ఇటు రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఇప్పుడు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేస్తే టీడీపీని నడిపించే తర్వాత తరం ప్రతి జిల్లాలోనూ బలంగా తయారవుతారన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ క్యాడర్ మహానాడులో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఓ కొత్త తరంలోకి టీడీపీని తీసుకెళ్లే మహానాడుగా.. కడప మహానాడు చరిత్రలో నిలిచే అవకాశం ఉంది.