హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలపై ప్రపంచవ్యాప్త దృష్టి ఉంది. అయితే అనూహ్యంగా పోటీల నుంచి మధ్యలోనే అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ లండన్ వెళ్లిపోయి అక్కడి మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి నిర్వాహకులపై ఆరోపణలు చేశారు. అందులో తీవ్రమైనవి ఉన్నాయి. వేశ్యలా చూశారని అన్నారు. దీంతో సహజంగానే అందాల ప్రపంచంలో సునామీ వచ్చింది. ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజకీయం కూడా జరుగుతోంది. నిజమేంటో తెలియకుండా చేసే ఆరోపణలు, నిర్దారణలతో మరకపడేది తెలంగాణపైనే.
వందల మంది పోటీదారుల్లో ఒక్కరి ఆరోపణలు
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపుగా ప్రతి చిన్న దేశం నుంచి పోటీ దారులు వచ్చారు. వివిధ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. అందరూ ఆతిధ్యం పట్ల, పోటీల పట్ల సంతృప్తిగా ఉన్నారు. అయితే ఏం నచ్చలేదో కానీ.. మిస్ ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు ఆమె ఎక్కడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఏ విషయంలోనూ తప్పులు వెదకలేదు. వెళ్లేటప్పుడు కూడా సంతోషంగా వెళ్లారు. ఆమె స్థానంలో మిస్ ఇంగ్లాండ్ రన్నరప్ ను పోటీలకు ఆహ్వానించారు కూడా. అయితే లండన్ వెళ్లిపోయి అక్కడ మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా పోటీల నిర్వాహకుల్ని కూడా.
మిస్ వరల్డ్ పోటీల్లో పార్టీలు, విందులు కామన్ !
మిస్ వరల్డ్ పోటీలు అంటేనే అదో ప్రపంచం. కామన్ మ్యాన్ కు సంబంధం లేని ప్రోగ్రాం అది. హై ప్రోఫైల్ ప్రపంచంలో ఉండే వారికి అదో ప్రత్యేకమైన కార్యక్రమం. పార్టీలు, విందులు అనేది సహజం. తెలంగాణ ప్రభుత్వం తాము కొంత ఖర్చు పెట్టి ఆతిధ్యం ఇస్తున్నందున వారితో ప్రచారం చేయించుకోవాలని అనుకుంది. అందుకే టూరిజం ప్రాంతాలకు పర్యటనలు చేయించింది. తెలంగాణ పర్యాటక ప్రాంతాలకు మరింతగా ప్రచారం కల్పించేందుకు ప్రయత్నించింది. ఈ విషయంలో ఎక్కడైనా విమర్శలు వచ్చాయంటే..అది తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు మీదనే. ఇరవై కోట్లే ఖర్చు పెడుతున్నామని కాంగ్రెస్ అంటే కాదు రెండు వందల కోట్లు అని బీఆర్ఎస్ అంటోంది.
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సోషల్ మీడియాలో ప్రచారం
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. నిజా నిజాలు ఇంకా బయటకు రాక ముందే కొంత మంది కాంగ్రెస్ పై ద్వేషంతో .. ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ప్రారంభించారు. ఏమీ లేని ఫోటోలను పెట్టి.. ఇక్కడే ఏదో జరిగిందని విశ్లేషించడం ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల తెలంగాణపైనే మరక పడుతుంది. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ చేసినవి చిన్న ఆరోపణలు కాదు. మహిళల క్యారెక్టర్ పై నింద వేసే ఆరోపణలు. అలాంటివి జరిగాయని ప్రచారం చేస్తే తెలంగాణ ఇచ్చిన ఆతిధ్యానికే మరక పడుతుంది. తెలంగాణ మీదనే ముద్ర పడుతుంది. రాజకీయం కోసం అలా చేయడం మంచిది కాదు.