విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆరోపించాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని చాలా మంది వైసీపీ నేతలు అనుకుని ఉండరు. ఎందుకంటే జగన్ రెడ్డి అవినీతి, కుటిల రాజకీయ ప్రస్థానంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. అక్రమాస్తులు వెనకేసుకోవడంలో అయినా.. పార్టీని ఓ సారి అధికారంలోకి తీసుకు రావడంలో అయినా విజయసాయిరెడ్డి పాత్ర ఏమిటో వైసీపీలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు లొంగిపోయాడని జగన్ రెడ్డి అంటున్నారు. ఇదిగో నిజమే అని వైసీపీ సోషల్ మీడియా ఓ ఇంట్లోకి విజయసాయిరెడ్డి, టీడీ జనార్దన్ వెళ్తున్న దృశ్యాలు విడుదల చేసి ప్రచారం చేస్తోంది. నిజంగానే విజయసాయిరెడ్డి.. చంద్రబాబుతో చేతులు కలిపితే జగన్ రెడ్డికి భవిష్యత్ ఉంటుందా అనేది సగటు వైసీపీ కార్యకర్తకు వచ్చే సందేహం.
ఓ ఇంట్లోకి టీడీ జనార్ధన్, వి.సా.రెడ్డి వెళ్లడం కుట్రనా ?
ఓ ఇంట్లోకి మొదట టీడీపీ నేత టీడీ జనార్ధన్ వెళ్లారు. తర్వాత విజయసాయిరెడ్డి వెళ్లారు. వాళ్లిద్దరూ ఆ ఇంట్లో చర్చలు జరిపారని వైసీపీ నేతలు , సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. వారు రహస్యంగా చర్చలు జరపాలనుకుంటే వారు ఇలా అందరికీ తెలిసేలా.. వెళ్తారా ?. సీసీ ఫుటేజీ వైసీపీకి వెళ్లేలా చూస్తారా అన్న కనీస లాజిక్ చూసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారు.
అది గాయపడిన ఓ రాజకీయ నేత నివాసం – పరామర్శకు వెళ్లిన నేతలు !
వైసీపీ నేతలు, సోషల్ మీడియా ప్రచారం చేస్తున్న వీడియోలు.. ఇటీవల గాయపడి ఆపరేషన్ చేయించుకున్న ఓ రాజకీయ నేత నివాసం. ఆయనను పరామర్శించేందుకు పలువురు ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీ జనార్ధన్ కూడా వెళ్లారు. తర్వాత విజయసాయిరెడ్డి వెళ్లారు. ఇద్దరూ ఆయనను పరామర్శించి బయటకు వచ్చి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇందులో కుట్రలు చేయడానికి ఏమీ లేదు. నిజంగా కుట్రలు చేయాలనుకుంటే ఇలా కాలవాల్సిన అవసరం ఉండదు. అంతకు మించిన మార్గాలు రాజకీయ నేతలకు ఉంటాయి.
వి.సా.రెడ్డి తల్చుకుంటే జగన్ భవిష్యత్ భయంకరం
వైసీపీ క్యాడర్ నమ్మినా నమ్మకపోయినా విజయసాయిరెడ్డి ఇప్పటికీ జగన్ రెడ్డిపై అభిమానంతోనే ఉన్నారు. తనను అవమానించారని జగన్ పై పగ తీర్చుకోవాలని ఇంకా అనుకోవడం లేదు. కానీ ఆయనను పదే పదే టార్గెట్ చేస్తూ.. ఆయన జగన్ పై పగ పెంచుకునేలా చేసేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే.. జగన్ రెడ్డి సంగతి చూడాలని అనుకుంటే జగన్ రెడ్డి భవిష్యత్ భయంకరంగా ఉంటుంది. జగన్ రెడ్డి గుట్టు ముట్లు అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి విజయసాయిరెడ్డి. లిక్కర్ కేసు కాదు అక్రమాస్తుల కేసులో అసలు విషయాలు చెబితే చాలు.. జగన్ రెడ్డి జీవితాంతం జైల్లోనే ఉంటారు. ఈ విషయాన్ని జగన్ తో పాటు ఆయన వందిమాగధులు మర్చిపోతే ఎలా ?