దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తానో కథానాయికకు కథ చెప్పానని, అయితే ఆ కథని లీక్ చేస్తోందని, ఓ దర్శకుడు ఎవరికి కథ చెప్పినా దాన్ని లీక్ చేయకూడదన్నది ఓ అలిఖిత నిబంధన అని, దాన్ని సదరు కథానాయిక బ్రేక్ చేస్తోందని, ఇదేం ఫెమినిజం? అని ప్రశ్నించారు. ”నాకు సినిమానే ప్రపంచం. ఓ కథ రాసుకోవడానికి సంవత్సరాలు కష్టపడతా. దాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఏం కావాలంటే అది చేసుకోండి. నేనెప్పటికీ భయపడను” అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ దీపికా పదుకొణేని ఉద్దేశించి చేసిందే అన్నది అందరి అభిప్రాయం. ఎందుకంటే ఈమధ్యే ఆయన దీపికకు `స్పిరిట్` కథ చెప్పారు. కథానాయికగా తీసుకొందామనుకొన్నారు. కానీ మధ్యలో దీపిక – సందీప్ మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. దాంతో దీపిక పక్కకు వెళ్లిపోయింది. ఆ స్థానంలో త్రిప్తిని ఎంచుకొన్నారు. అయితే తనని పక్కన పెట్టారన్న కోపంతో దీపిక రగిలిపోతోందని, అందుకే `స్పిరిట్` కథని అందరికీ లీక్ చేస్తోందని, అంతే కాకుండా ఇదో ఏ గ్రేడ్ సినిమా అంటూ ప్రచారం చేస్తోందని తెలుస్తోంది. ఈ విషయం సందీప్ రెడ్డికి తెలిసింది. దాంతో ఇలా స్పందించాల్సివచ్చింది.
అయినా దీపికా లాంటి స్టార్ మరీ ఇంత చిన్నపిల్లలా ప్రవర్తించడం ఏమిటో అర్థం కావడం లేదు. తనని పక్కన పెట్టారన్న పంతం, కోపం ఇలా ప్రదర్శిస్తే నటిగా తన స్పిరిట్ ఏమైనట్టు? ఓ సినిమా నుంచి ఓ కథానాయికని తప్పించడం కొత్తగా జరిగిందేం కాదు. ఇలాంటి విషయాలు చాలా సాధారణం. కానీ ఏ కథానాయిక.. తాను తప్పుకొన్న సినిమాని డామేజ్ చేయడానికి ప్రయత్నించలేదు. ఓరకంగా సందీప్‌పై, స్పిరిట్ టీమ్ పై దీపిక రివైంజ్ తీర్చుకోవడానికి సిద్ధమైనట్టే కనిపిస్తోంది.
అయినా సందీప్ రెడ్డి ఊరుకొనే టైప్ కాదు. ఎవరితోనైనా డేరింగ్ అండ్ డాషింగ్ గానే వ్యవహరిస్తాడు. ట్వీట్ లో ఇప్పుడు దీపికా పేరు తీయలేదు. కానీ ఏదో ఒకరోజు దీపికకు నేరుగా స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం గ్యారెంటీ.