‘కన్నప్ప’ హార్డ్ డిస్క్ మాయమైంది. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులపై కేస్ పెట్టింది ‘కన్నప్ప’ టీమ్. కన్నప్ప హార్డ్ డిస్క్ పట్టుకొని ఇద్దరు పారిపోయారని, వాళ్లని పట్టుకోవాలని పోలీసుల్ని కోరారు కన్నప్ప ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్.
కన్నప్ప సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని ముంబైలోని ఓ స్టూడియోలో విజువల్ ఎఫెక్ట్స్ చేయించారు. వాళ్లేమో ఆ సన్నివేశాల్ని హార్డ్ డిస్క్ లో పెట్టి కొరియర్ చేశారు. ఆ కొరియర్ అందుకొన్న ఆఫీస్ బాయ్ రఘు దాన్ని తన దగ్గరే అట్టిపెట్టుకొన్నాడు. ఇప్పుడు మరో మహిళతో కలిసి పరార్ అయ్యాడు. ఆ హార్డ్ డిస్క్ కోసం ఇప్పుడు పోలీసుల్ని ఆశ్రయించింది టీమ్.
విష్ణు చెబుతోంది నిజమే అయితే ‘కన్నప్ప’ రూ.200 కోట్ల సినిమా. అలాంటి ఖరీదైన సినిమాలోని సన్నివేశాల్ని ఇలా కొరియర్లలో పంపిస్తారా ఎవరైనా? ఒకవేళ హార్డ్ డిస్క్ మిస్ అయినా, సాఫ్ట్ కాపీ సదరు స్టూడియోలో ఉంటుంది కాబట్టి బెంగ పడాల్సిన పనిలేదు. అయితే ఈలోగా ఆ సన్నివేశాలు లీక్ చేస్తారేమో అనే భయం విష్ణుకి ఉండి ఉంటుంది. పారిపోయిన ఇద్దరూ ఒకరి ‘గైడెన్స్’లో నడుస్తున్నారని, దీని వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి ఉన్నారని ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారని తెలుస్తోంది.
మంచు మనోజ్ తో విష్ణుకి గొడవలున్న సంగతి తెలిసిందే. విష్ణు కూడా ఇక్కడ పరోక్షంగా మంచు మనోజ్ పేరే ప్రస్తావించాడనిపిస్తోంది. జనరేటర్లో పంచదార పోయడం.. హార్డ్ డిస్కులు ఎత్తుకుపోవడం… ఇలాంటివన్నీ మంచు కుటుంబంలోనే జరుగుతాయెందుకో మరి.