ఓటీటీలు చిత్రసీమని, థియేటర్ వ్యవస్థనీ సర్వ నాశనం చేస్తున్నాయని బలంగా నమ్ముతున్న కథానాయకుడు అమీర్ ఖాన్. ఈ విషయమై చాలాసార్లు వేదికలపై మాట్లాడాడు అమీర్. ఓటీటీలకు ఎప్పుడో ఒకప్పుడు చెక్ పెట్టాల్సిందేనని ఆయన గట్టిగా చెబుతూ వచ్చారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. అమీర్ కొత్త చిత్రం `సితారే జమీర్ పర్` త్వరలో విడుదల కాబోతోంది. ఈ సినిమాని అమీర్ ఓటీటీలకు ఇవ్వలేదు. సినిమా చూడాలంటే థియేటర్లోనే చూడాలి. సినిమా విడుదలైన 8 వారాల తరవాత యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటుంది. కానీ పే ఫర్ వ్యూ… ఆప్షన్లో. అంటే సినిమా చూడాలంటే నిర్దిష్టమైన ధర చెల్లించాలన్నమాట.
ఓరకంగా అమీర్ చేస్తున్న ఖరీదైన ప్రయోగం ఇది. ఓటీటీల రూపంలో మంచి మొత్తాన్ని వదులుకొంటూ రిస్క్ చేస్తున్నాడు. ‘సితారే జమీన్ పర్’లాంటి సినిమాని ఓటీటీకి అమ్మితే మంచి లాభాలొస్తాయి. పెట్టుబడి మొత్తం అక్కడ్నుంచే రాబట్టొచ్చు. విడుదలకు ముందే సేఫ్ కావొచ్చు. కానీ అమీర్ ఇలా ఆలోచించడం లేదు. తనకు ఓటీటీ మార్కెట్ లేకపోయినా ఫర్వాలేదు.. తన సినిమాని జనాలు థియేటర్లలోనే చూడాలని భావిస్తున్నాడు. ఇప్పటి వరకూ ‘ఓటీటీలో సినిమా వస్తుందే.. అప్పుడు చూసుకొందాం’ అని ప్రేక్షకులు లైట్ తీసుకొన్నారు. ఓటీటీలో రాకపోతే.. ఓ మంచి సినిమాని మిస్ అవుతాం కదా? అనే ఫీలింగ్ వస్తే తప్పకుండా థియేటర్లకు వెళ్తారు. ఇది అమీర్ ఖాన్ లాజిక్. పే ఫర్ వ్యూ కూడా మంచి ఆప్షనే.అన్ని ఓటీటీలు అందరికీ అందుబాటులో లేకపోవొచ్చు. కానీ యూ ట్యూబ్ అలా కాదు. ఇంటర్నెట్ ఉన్న ప్రతి ఒక్కరికీ అది ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. కాబట్టి… సినిమా బాగుందన్న టాక్ వస్తే, 8 వారాల తరవాత యూ ట్యూబ్లో చూసుకొనే అవకాశం ఉంది.
అమీర్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఓటీటీల రూపంలో వచ్చే ఆదాయం యూ ట్యూబ్ లో వస్తుంటే.. అందరూ ఇదే ఫార్ములా ఫాలో అవుతారు. అప్పుడు ఓటీటీ దూకుడుకు చెక్ పడుతుంది.