హైదరాబాద్ శివారులో ఐటీ కారిడార్ తర్వాత హాట్ ప్రాపర్టీలాంటిది శంషాబాద్. ఒకప్పుడు ఎయిర్ పోర్టు ఒక్కటే ప్లస్ పాయింట్ కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగ , ఉపాధి కేంద్రంగా మారింది. సిటీలోకి రాకపోకలు సాగించడానికి అద్భుతమైన మార్గాలున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ లోని బడా సంస్థలన్నీ దాదాపుగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి.
మద్యతరగతికి అందుబాటులో ఉండేలా లగ్జరీ సౌకర్యాలతో వీటిని నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా రూమ్, లైబ్రరీ, కమ్యూనిటీ హాల్ వంటి సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్లలో ధరలు కోటి వరకూ ఉంటున్నాయి. 3 BHK అపార్ట్మెంట్లు కోటి నుంచి కోటిన్నర వరకూ చెబుతున్నారు. 2 BHK అపార్ట్మెంట్లు 80 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ ధరలు పూర్తి స్థాయి ప్రమాణాలకు 70శాతానికిపైగా ఓపెన్ స్పేస్ ఉన్న ప్రాజెక్టుల్లో.
స్థానిక బిల్డర్లు, చిన్న చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కట్టే అపార్టుమెంట్లలో ధరలు ఇంకా తక్కువకు ఉంటున్నాయి. ఇలాంటి చోట్ల యాభై లక్షల కు అపార్టుమెంట్ లభిస్తోంది. కనీసం వెయ్యి ఎస్ఎఫ్టీకి ఈ ధర పెట్టవచ్చు. శంషాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఇక్కడ ధరలు గత ఏడాదిలో 22 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో పెరుగుదల ఎలా ఉన్నా.. శంషాబాద్‌కు ఢోకా ఉండదని రియల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.