ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ కు 99పైసలకే ఎకరా భూమిని కూటమి సర్కార్ కట్టబెట్టిందని జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందిస్తూ ఆయనకు సవాల్ విసిరారు. 99పైసలకే ఎకరా భూమిని కట్టబెట్టినట్లు జగన్ రెడ్డి నిరూపిస్తే..తాను రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారమే ఉర్సాకు భూములను కట్టబెట్టామని, జగన్ చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.
దొంగే దొంగ దొంగ అన్నట్లుగా జగన్ వైఖరి ఉందని ఎద్దేవా చేశారు నారా లోకేష్. లిక్కర్ స్కామ్ లో రాజకీయ కక్ష సాధింపులకు తావు లేకుండా దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందని తెలిపారు. ఇక, మిషన్ రాయలసీమకు కూటమి సర్కార్ కట్టుబడి ఉందన్న లోకేష్..వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసిందని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు వస్తే ఉపాధి అవకాశాలు వస్తాయని, 20లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని చెప్పారు లోకేష్. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. జూన్ 12లోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని , సరైన సమయంలో అందరికీ పదవులు వస్తాయని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయిలో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసి , మూడు నెలలకు ఓసారి ఫీడ్ బ్యాక్ తీసుకుంటానని అన్నారు లోకేష్.