రిమేక్ సినిమాలు తీయడం ఎప్పుడూ కత్తి మీద సామే. ఒక భాషలో ఇప్పటికే జనాదరణ పొందిన కథని మరో భాషలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే చాలా ఈక్వేషన్లను పరిశీలించాల్సి వస్తుంది. ముఖ్యంగా కథలోని కోర్ ఎమోషన్ని ఒరిజినల్లో ఉన్నట్టుగానే మరో భాషలో మళ్లీ రీక్రియేట్ చేయడం చాలా పెద్ద పని. కథ, సీన్లు ఉన్నాయనుకుని వేరే భాషలో బ్లైండ్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తే మాత్రం దెబ్బ తినాల్సి వస్తుంది. తాజాగా వచ్చిన ‘భైరవ’ పరిస్థితి కూడా ఇలానే ఉంది.
తమిళంలో వచ్చిన ‘గరుడన్’ సినిమాకి ఇది రీమేక్. నిజానికి ‘గరుడన్’ సినిమా కూడా యునానిమస్ హిట్ కాదు. ఈ సినిమా కథ వెనుక దర్శకుడు వెట్రిమారన్ హస్తముంది. గరుడన్ కథ వెట్రిమారన్ టేబుల్ మీద ప్రిపేర్ అయినది. ఆయన కథలు చాలా లోతుగా ఉంటాయి. నిజానికి ‘గరుడన్’ కథ యూనివర్సల్. మహాభారత కాలం నాటి నుంచి నేటి వరకు జరుగుతున్న కథే. భూమి, డబ్బు, స్త్రీ..ఈ మూడు అంశాల చుట్టూనే ఏ యుద్ధమైనా జరుగుతుంది. గరుడన్ మూల కథ కూడా అదే.
ఆ కథ నేపథ్యం తమిళంలో బాగానే కుదిరింది. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో ‘గరుడన్’కి కొన్ని మైనస్‌లు ఉన్నాయి. గరుడన్ ట్రీట్మెంట్ చాలా సాదాసీదాగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ప్రజెంటేషన్‌లో పెద్దగా కొత్తదనం ఉండదు. కానీ ఆ హీరోలకున్న ఇమేజ్, నేల మీద సాము చేసే సీన్లతో ప్రేక్షకులకు కొంతవరకు బాగానే అనిపించింది.
అయితే అదే కథని ‘భైరవం’గా రీమేక్ చేసినప్పుడు ‘గరుడన్’లోని లోటుపాట్లను సెట్ చేసినట్టుగా అనిపించలేదు. అక్కడ ట్రీట్మెంట్ ఎలా అయితే, ఎలాంటి కొత్తదనం లేకుండా చప్పగా సాగిందో, రీమేక్‌లో కూడా అదే రొటీన్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోయారు. సగటు కమర్షియల్ సినిమా చుట్టేసినట్లు ఎమోషన్‌ను పక్కకు వదిలేసి, ఎలివేషన్‌కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో కథలో ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యింది.
రీమేక్ చేసినప్పుడు ప్లస్సుల్ని గట్టిగా పట్టుకొని, మైనస్సుల్ని సరి చేయాలన్నది ఓ సూత్రం. దాన్ని దర్శకుడు సరిగా పట్టించుకోలేదనిపిస్తుంది. అయినా ఈకాలంలో రీమేకులు తీయడం కూడా ఆత్మహత్యాసదృశ్యమే. ఎందుకంటే ఓ భాషలో మంచి సినిమా వస్తే, దాన్ని ఓటీటీలో సబ్ టైటిల్స్‌తో సహా చూసేస్తున్నారు. అలాంటప్పుడు కొత్తగా ఆవిష్కరించేది ఏముంటుంది? `గరుడన్`ని తెలుగులో రీమేక్ చేస్తున్నారన్న సంగతి తెలియగానే ఆ సినిమా చూసినవాళ్లెందరో. తమిళంలో చూసిన ఫీల్ తెలుగులో లేకపోయేసరికి చాలామంది నిరుత్సాహ పడ్డారు. అసలు ఇది రీమేక్ అని తెలియనివాళ్లకు మాత్రం ముగ్గురు హీరోల మాస్ పెర్‌ఫార్మ్సెన్స్ నచ్చింది. అదే ఈ సినిమాకు కాస్త దోహదం చేసింది.