తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఉక్కపోతకు గురవుతున్నారని అటు కాంగ్రెస్ పార్టీలో ఉండలేక…ఇక బీఆర్ఎస్ లోకి పోలేక ఇబ్బంది పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు రాజకీయం మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది.
కాంగ్రెస్ లోకి ఆలంపూర్ ఎమ్మెల్యే
ఉమ్మడి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో ఒకటి ఆలంపూర్. రిజర్వుడు నియోజకవర్గం అయిన ఆలంపూర్ నుంచి విజయుడు అనే అభ్యర్థికి చివరి క్షణంలో కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. గెలిచారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తో సన్నిహితమయ్యారు. ఆ పార్టీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. నిజానికి ఈ విజయుడికి యజమాని ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి. ఆయన ఏం చెబితే అది చేస్తారు. ఆ వెంకట్రామిరెడ్డి ఇప్పటికే రేవంత్ రెడ్డికి సన్నిహితమయ్యారు. దీంతో విజయుడు అనధికారికంగా కాంగ్రెస్ తో కలిసిపోయారు.
గ్రేటర్ పరిధిలో మరికొంత మంది ఎమ్మెల్యేలు
గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ఇటీవల పార్టీకి దూరంగా ఉంటున్నారు. విమర్శలు చేశారు కానీ ఇప్పుడు ఆపేశారు. పెద్దగా బయట కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లోనూ కనిపించడం లేదు. ఆయనకు అనర్హతా భయం ఉంది. ఆ విషయం పక్కన పెడితే గ్రేటర్ ఎన్నికలు రానున్న సమయంలో కొంత మంది చేయి పట్టుకునేందుకు రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా పట్టు నిలుపుకోవాలంటే తమ అనుచరులు కార్పొరేటర్లుగా ఉండాలి. ప్రభుత్వం అధికారంలో ఉండాలి. లేకపోతే పనులు జరగవు. అందుకే వారు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
బీఆర్ఎస్ పరిణామాలతో ఆందోళన
భారత రాష్ట్ర సమితిలో ఎం జరుగుతుందో బీఆర్ఎస్ నేతలకూ అర్థం కావడం లేదు. పార్టీ ఉనికిపై సందేహాలు వస్తున్నాయి. బీజేపీలో కలుపుతారని జరుగుతున్న ప్రచారానికి బలమైన ఘటనలు కళ్ల ఎదురుగా కనిపిస్తూండటంతో చాలా మంది పక్క చూపులు చూసుకుంటున్నారు. బీజేపీలో చేరితే.. గ్రేటర్ బీఆర్ఎస్ నేతలకు గడ్డు పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాలన్నీ కలిసి కాంగ్రెస్ లో చేరికలకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. కానీ అక్కడ చేరిన తర్వాత ఉక్కపోతను తట్టుకోగలరా అన్నదే పెద్ద సమస్య.