పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు.. నేతల మధ్య పంచాయతీలు తీర్చడానికే సమయం సరిపోవడం లేదు. ఏ నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేసినా.. నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షలో ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.
ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో కలిసి తిరుగుతున్నారు. ఎంపీ మల్లు రవి ఆయనను ప్రోత్సహిస్తున్నారు. దీంతో అక్కడి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంపత్ కుమార్ ఏఐసీసీలోనూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన మల్లు రవిపై తీవ్ర విమర్శలు చేశారు. నియోజకవర్గం మొత్తం బీఆర్ఎస్ నేతలతో కలిసి తిరుగుతున్నారని ఆరోపించారు.
బుధవారం జరిగిన నియోజకవర్గ సమీక్షలోనూ ఇలాంటి సమస్యలే తలెత్తాయి. నియోజకవర్గాల అభివృద్ది కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారని అనుకుంటే నేతలందరూ తమ పంచాయతీలు ఆమె ముందు పెడుతున్నారు. ఇప్పటికే పదవులు రాలేదని.. క్యాడర్ అసంతృప్తితో ఉంటే వీరు మాత్రం.. తమ ఆధిపత్య పోరుతో హైకమాండ్ ప్రతినిధికి సమస్యలు సృష్టిస్తున్నారు.