ట్యాపింగ్ కేసులో పాస్ పోర్టు ఇప్పిస్తే మూడు రోజుల్లో ఇండియా వచ్చి పోలీసుల ముందు హాజరవుతానని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాలేదు. ఐదో తేదీన వచ్చేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్క సారి ఉపయోగపడే పాస్ పోర్టు ఆయనకు అందింది కూడా. గతంలో ఆయన పాస్ పోర్టు రద్దు చేయడంతో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ పాస్ పోర్టు ఇచ్చారు. ఇక రావాల్సిన ఆయన రావడం లేదు.
ఐదో తేదీన వస్తామని సమాచారం ఇచ్చారు. ఆయన రాకపోవడంతో సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా అయిందని భావిస్తున్నారు. రెండు రోజుల్లో వస్తారని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు చూస్తే వస్తారో రారో తెలియనట్లుగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో వస్తానని చెప్పారు. తర్వాత గ్రీన్ కార్డు భారీగా ఖర్చు పెట్టి తీసుకున్నారు. ఇప్పుడు పాస్ పోర్టు వచ్చినా రావడం లేదు.
ఆయనను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాడనికి తెలంగాణ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ లోపే సుప్రీంకోర్టుకు వెళ్లారు. పాస్ పోర్టు అందిన మూడు రోజుల్లో వచ్చేలా సుప్రీంకోర్టుకు చెప్పి హాజరు కాకపోవడంతో తదుపరి చర్యలకు పోలీసులు సన్నహాలు చేస్తున్నారు. అయితే ఆయనకు అనుకోని సమస్యలు రావడం వల్ల ఆగిపోయారని.. రెండు, మూడు రోజుల్లో హాజరవుతారని.. సుప్రీంకోర్టును ధిక్కరించేంత సాహసం చేయరని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.