రీ రిలీజ్లు వెల్లువలా వస్తున్నాయి. ఈసారి ‘లక్ష్మీనరసింహా’ వంతు వచ్చింది. బాలకృష్ణ – జయంత్ పరాన్జీ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఇది. అప్పట్లో పాటలు, బాలయ్య మాస్ డైలాగులకు వన్స్ మోర్ అప్లాజులు వచ్చేవి. రీ రిలీజ్ ట్రెండ్‌కు సరిపోయే సినిమానే. అయితే ఈసారి ఓ కొత్త ప్రయోగం చేశారు. ఈ సినిమాలో ఓ పాటని జోడించారు. అది కూడా చాలా విచిత్రంగా జరిగిన విషయం. ‘లక్ష్మీ నరసింహా’ కోసం అప్పట్లో ఓ పాట షూట్ చేసి, దాన్ని ఎడిట్ లో తొలగించారు. ఆ పాటని మళ్లీ జోడించాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ ఫిక్సయ్యారు. కాకపోతే.. పాట ఉంది. సౌండ్ లేదు. దాంతో ఆ విజువల్స్ కు సరిపడా మ్యూజిక్ భీమ్స్ తో చేయించి, పాటనేమో చంద్రబోస్ తో రాయించారు. ఓరకంగా ఇదో ప్రయోగం అనుకోవాలి. మాంటేజ్ పాటైతే ఓకే. కానీ లిప్ సింక్, డాన్స్ మూమెంట్ ఉన్న పాట ఇది. ఆ విజువల్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్ కంపోజ్ చేసి, పాట రెడీ చేయడం మామూలు విషయం కాదు. కాబట్టి ఇదో ట్రెండ్ సెట్టింగ్ రీ రీలీజ్ అనుకోవాలి.
నిజానికి ఇది మంచి మార్కెట్ స్ట్రాటజీ. పాత సినిమాలో కొత్త విషయాలేవో జోడిస్తే చూసేవాళ్లకు ఆసక్తి ఏర్పడుతుంది. ఎడిట్ లో తీసేసిన సన్నివేశాలు, పాటలు మళ్లీ జోడించి రీ రిలీజ్ చేయగలిగితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. కాకపోతే ఆ ఫుటేజీ ఇప్పుడు అందుబాటులో ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. చాలా సినిమాల్లో పాటలు షూట్ చేసి, చివర్లో తీసేశారు. అలాంటి సినిమాలన్ని లిస్టవుట్ చేసి, వాటిని రీ రిలీజ్ చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఆ దిశగా నిర్మాతలు ఆలోచిస్తే బాగుంటుందేమో?