అసలే బీఆర్ఎస్ ను ఇంటి కష్టాలు వెంటాడుతున్నాయి. వాటిని నుంచి ఎలా బయటపడాలో తెలియక గింజికుంటోంది బీఆర్ఎస్. ఇది చాలదు అన్నట్లు కాళేశ్వరం కమిషన్ నోటీసులు సరేసరి. ఇట్లాంటి సమయంలో న్యాయనిపుణులతో డిస్కషన్స్ చేయడానికే టైం సరిపోతుంది. కానీ , హరీష్ రావు పీపీటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని, అందులో ఎలాంటి అవినీతి లేదని పీపీటీ ఇచ్చినా మళ్లీ తాజాగా అదే పని చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసే క్రమంలో బీఆర్ఎస్ కాళేశ్వరంపై పీపీటీ ఇచ్చింది. ప్రాజెక్టు వద్దకే వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని, ప్రాజెక్టుతో తెలంగాణ నేల దాహార్తి తీర్చామని గొప్పగా చెప్పుకున్నారు. అయినా కాంగ్రెస్ నేతల విమర్శలు కొనసాగడంతో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంపై ఎప్పటికప్పుడు తమ వాయిస్ ను వినిపిస్తూనే వస్తున్నారు. ప్రతి సమయంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టును ఎజెండా మీద ఉంచుతున్నారు. కాళేశ్వరం లేకుంటే పెద్దమొత్తంలో తెలంగాణలో భూములు సాకులోకి వచ్చేవి కావని చెప్తున్నారు.
ఇలా ఎప్పటికపుడు కాళేశ్వరంపై మాట్లాడుతున్నా తాజాగా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాళేశ్వరంతో 20లక్షల ఎకరాలకు పైగా సాగునీరు ఇచ్చామని హరీష్ రావు చెప్పారు. అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే… కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల అంచనాలు పెరగలేదా, ఇప్పుడు పెరిగితే తప్పేంటి అని చెప్పుకొచ్చారు. అయితే, సెకండ్ టైం కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం వెనక రాజకీయపరమైన కారణం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ , హరీష్ రావును విచారించాక తుది రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించనుంది. అందులోనూ అవినీతి జరిగిందని తేల్చితే.. కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు ఇన్నాళ్లుగా చెప్తున్నది అంతా అవాస్తవమేనని తేలుతోంది. పైగా, బీఆర్ఎస్ పెద్దలపై చర్యలు తీసుకుంటే సానుభూతి కూడా కరువు అవుతుంది. వీటిని అంచనా వేసి ముందస్తుగా మరోసారి కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు, ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేందుకు ఈ పీపీటీ ఇచ్చారని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు తదుపరి తీసుకొబోయే చర్యలకు రాజకీయ కక్షసాధింపులో భాగమే అని చెప్పేందుకు ఈ సెకండ్ టైం పీపీటీ అని చెప్తున్నారు.